పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు ఒకటి. సమర్ధుడైన, మంచి దర్ళకుడు క్రిష్ అందించే పీరియాడిక్ మాస్ యాక్షన్ సినిమా. అన్నింటికన్నా ముందుగా ప్రారంభమైంది. కానీ ఒక్కో సినిమా దాన్ని దాటుకుంటూ వెళ్లి విడుదలైపోతున్నాయి. మరికొన్ని విడుదలకు సిద్దం అవుతున్నాయి. వాటికీ, ఈ సినిమాకు కీలకమైన తేడా ఒకటే. ఆ సినిమాలకు పవన్ కళ్యాణ్ పెద్దగా కష్టపడక్కరలేదు. ఈ సినిమాకు బాగా కష్టపడాలి. ఆ సినిమాలకు అలా అలా అప్పుడప్పుడు షూట్ చేస్తే సరిపోతుంది. ఈ సినిమాకు రోజుల తరబడి షూట్ చేయాలి.
విషయం ఏమిటంటే ఈ సినిమా ఒప్పుకున్న నాటికి పవన్ కళ్యాణ్ కు ‘వెసులుబాటు’ అనేది తెలియదు. గతంలో అనేక సినిమాలు చేసిన మాదిరిగానే ఈ సినిమా చేయడానికి ఒకె అన్నారు. కానీ ఆ తరువాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో లతో రాను రాను వెసులు బాటు పెరుగుతూ వస్తోంది. రెండు రోజులు, నాలుగు రోజులు టైమ్ దొరికితే చాలు షూట్ చేస్తున్నారు. లేదంటే లేదు. అలా అలా ముఫై, ముఫై అయిదు రోజుల్లో సినిమా రెడీ అయిపోతోంది. యాభై నుంచి అరవై అయిదు కోట్లు రెమ్యూనిరేషన్ అందుతోంది.
కానీ హరి హర వీరమల్లు అలాంటి సినిమా కాదు. ఓ షెడ్యూలు ప్లాన్ చేయాలంటేనే పెద్ద ప్రణాళిక కావాలి. అప్పటికప్పుడు ఫోన్ చేసి, వస్తున్నా అంటే రెడీ అయిపోయేది కాదు. వందల కొద్దీ జూనియర్ ఆర్టిస్ట్ లు, సెట్ లు, గెటప్ లు, గుర్రాలు, ఇలా ఒకటేమిటి సవాలక్ష వున్నాయి. అలాంటి షెడ్యూలు ఇలా స్టార్ట్ చేసి అలా ఆపేసేది కాదు. ఒకసారి ఓ షెడ్యూలు మొదలుపెడితే కనీసం పది నుంచి పన్నెండు రోజులు షూట్ చేయాల్సి వుంటుంది. దీనికి హీరో దగ్గర నుంచి అందరూ టైమ్ కేటాయించాలి. దానికి తోడు బడ్జెట్ కూడా ఖర్చు చేయాలి.
పవన్ కు ఇప్పుడున్న పొలిటికల్ కమిట్ మెంట్లతో ఒకే వరుసన పది, పన్నెండు రోజులు కేటాయించే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. మండే టు ఫైడే లెక్కన ఇస్తామంటే యూనిట్ కు సరిపోవడం లేదు అది కీలకమైన సమస్య.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తక్కువ రోజుల పట్టే సీన్లు అన్నీ ముందే తీసేసారు. కీలకమైన అయిదారు సీన్లు, ముఖ్యంగా క్లయిమాక్స్ బకాయి వుంది. వీటన్నింటికీ కనీసం 12 రోజుల నుంచి 15 రోజుల వంతున హీరో వరుసగా కేటాయించాల్సి వుంది. అంటే ఎలా లేదన్నా మరో అరవై రోజులు పవన్ కేవలం ఈ సినిమాకు కేటాయించాలి. అన్ని రోజులు ఇవ్వడం సాధ్యమా అన్నది అనుమానం. ఉస్తాద్ భగత్ సింగ్ కే 60 రోజలు మించి కేటాయించలేనని పవన్ అన్నారని గ్యాసిప్ లు వచ్చాయి.
పైగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పవన్ సరిపడనంతా టైమ్ అటు కూడా కేటాయించాలి. అందువల్ల హరి హర వీరమల్లు వెలుగు చూడడం అన్నది ఎప్పటికి సాధ్యం అవుతుందో ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్న.
ఈ ఏడాది చివరిలోకి ఓజి సినిమా అయితే పూర్తవుతుంది. అది మాత్రం ఫిక్స్. ఉస్తాద్ అదృష్టం ఎలా వుంటుందో చూడాలి. ఈ నెల 7 నుంచి 13 వరకు షెడ్యూలు వుంది ఆ సినిమా. ఆ తరువాత మళ్లీ ఎప్పుడు వుంటుందో తెలియాల్సి వుంది.
వీటి సంగతి ఎలా వున్నా హరిహర వీరమల్లు టీమ్ ను తలచుకుని ‘హరి హర’ అనుకోవాల్సిందే.