ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే నచ్చని వారిలో మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే). ప్రతి వారం ఆర్కే రాసే కొత్త పలుకులో జగన్‌పై విద్వేష రాతలను బట్టి ఈ మాట చెప్పాల్సి వస్తోంది. అలాగే ఆయన పత్రికలో ప్రతి అక్షరం జగన్‌ను వ్యతిరేకించేదే. బహుశా ఒక నాయకుడిపై ఈ స్థాయిలో విషపు రాతలు రాసే పత్రిక మరెక్కడా ఉండదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా ఆర్కే “కాంగ్రెస్‌ను కమ్మేసిన జగన్మాయ” శీర్షికతో రాసిన కొత్తపలుకు కూడా జగన్‌కు వ్యతిరేక పంథాలో ఎప్పట్లాగే సాగింది. కాంగ్రెస్‌ను జగన్ మాయ కమ్మేసిందో లేదో తెలియదు కానీ, ఆర్కేని మాత్రం జగన్ పిచ్చోడిని చేశారనే అభిప్రాయం కలగకమానదు. ఈ వారం ఆర్కే పూర్తిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం సహజంగానే విలువలకు పాతరేసి రాశారనే విమర్శ వెల్లువెత్తుతోంది.
జగన్‌పై బీజేపీకి అనుమానం, కోపం కలిగించే కుట్రలో భాగంగా ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ కథనం చదివితే, ఆయన లక్ష్యం నెరవేరడం పక్కన పెడితే, అబ్బో ఏపీ ముఖ్యమంత్రి మామూలోడు కాదనే గౌరవం పెరుగుతుంది. మరోవైపు వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికే షర్మిలను చేర్చుకుంటున్నారనే కోపం సోనియా, రాహుల్‌గాంధీలపై వైసీపీ శ్రేణుల్లో ఉండేది. ఈ కథనంలో వైఎస్సార్ కుటుంబంలో గొడవలు పెట్టడం తమకు ఇష్టం లేదని షర్మిలతో రాహుల్‌గాంధీ అన్నారని చెప్పడం ద్వారా, వైసీపీలో సానుకూలత ఏర్పడింది.
అలాగే ఏపీలో షర్మిల ఎంట్రీకి కాంగ్రెస్ ససేమిరా అంటోందనే సమాచారం పంపడం ద్వారా, వైసీపీ ఖుషీ అవుతుంది. కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగి, మోదీని ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ప్రధాని కానివ్వనని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆవేదనను ఆర్కే బయట పెట్టుకున్నారు.
‘నేను మీ వాడినే ఎన్నికల తర్వాత మా ఎంపీలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారు’ అని కాంగ్రెస్ అధిష్ఠానానికి సందేశం పంపడం మామూలు రాజకీయం కాదుకదా! కాంగ్రెస్ పార్టీ ఊసే గిట్టని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం తెలుసో లేదో తెలియదు. అధికారికంగా పొత్తులు లేకపోయినా జగన్ తమకు అత్యంత విశ్వాసపాత్రుడని బీజేపీ అగ్ర నాయకులు విశ్వసిస్తున్నారు’ …ఇదీ ఆర్కే బాధ. కాంగ్రెస్‌తో జగన్ అవగాహన కుదుర్చుకున్న అంశం ఆర్కేకి తెలుసు కానీ, బీజేపీకి తెలియదట! మరోవైపు జగన్ తమకు అత్యంత విశ్వాసపాత్రుడని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారని చెప్పడం అంటే, చంద్రబాబు వ్యూహాలేవీ వర్కౌట్ కాలేదని అర్థమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం మద్దతు జగన్‌కు ఉన్నంత వరకూ తామేమీ చేయలేదమని టీడీపీ, ఎల్లో మీడియా గింజుకుంటోంది. ఎలాగైనా బీజేపీలో అనుమానం కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి అసంబద్ధ, అర్థంపర్థం లేని కథనాలు రాయడం ఆర్కేకి మాత్రమే తెలిసిన విద్య. ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను బుట్టలో వేసుకోగలగడం జగన్‌కు మాత్రమే సాధ్యమని ఎవరైనా అంగీకరించాల్సిందే అని ఆర్కే రాసుకొచ్చారు. తాను రాసారు కాబట్టి, అదే నిజమని అందరూ నమ్మాల్సిందే అని ఆర్కే ఆదేశాలిచ్చారు.
జగన్ వ్యూహంతో షర్మిల షాక్‌కు గురి అవుతోందట! ఈ రాజకీయ వ్యూహంలో షర్మిల పావుగా మారబోతున్నారట! ఇంతకాలం జగన్‌పై విసిరిన బాణం షర్మిల అంటూ రాసిన రాతలన్నీ అబద్ధాలే అని ఆర్కే తన తాజా కొత్త పలుకు ద్వారా ఆర్కే చెప్పదలుచుకున్నారా? జగన్, కాంగ్రెస్ మధ్య కుదిరిన అవగాహన గురించి తెలిసి చంద్రబాబు తెల్లముఖం వేస్తున్నారట! కాంగ్రెస్‌తో కలిసి జగన్‌పై కేసులు వేసి, ఆయన్ను జైలుపాలు చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అండదండలు లేనిదే జగన్‌పై సీబీఐ, ఈడీలు కేసులు నమోదయ్యేవా? ఆయన ఇబ్బందులు పాలయ్యేవాడా? అనేది ఇప్పటికీ జనం వేస్తున్న ప్రశ్న.
ఆర్కే రాతల ప్రకారం …ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల రాజకీయ ప్రవేశం ఉండదు. అన్నకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేయనని చెబుతున్న షర్మిల ఆకాంక్షకు తగ్గట్టే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సానుకూలంగా స్పందించారు. అన్నచెల్లెళ్ల మధ్య గొడవలు పెట్టామన్న అపవాదు రావడం తమకు ఇష్టం లేదని రాహుల్‌గాంధీ అన్నారు. తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రాల్లో షర్మిలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు.
షర్మిల, జగన్ మధ్య విభేదాలను తగ్గించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని వైసీపీ శ్రేణులు సైతం సంబరపడి సందర్భం ఇది. మరీ ముఖ్యంగా షర్మిల అత్యధికంగా సంతోషించేలా రాహుల్ ఎంతో గొప్పగా వ్యవహరించారనే గౌరవం కలుగుతుంది. తాను కోరుకున్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తుంటే, ఇక షర్మిల జీర్ణించుకోలేనిది ఏముందో ఆర్కే చెప్పాల్సి వుంటుంది. తాను జీర్ణించుకోలేని రాజకీయం ఏదో జరుగుతోందని ఆయన రాతలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆశాజనక పరిస్థితులున్నాయని, షర్మిలను చేర్చుకుంటే నష్టమవుతుందని ఆర్కే వాపోతున్నారు. సీమాంధ్రులను తమ వైపు ఆకర్షించడానికి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటివారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఇప్పుడు జగన్‌తో అవగాహన కుదిరిందని తెలిసి సెటిలర్లు ఆ పార్టీకి దూరం అవుతున్నారని ఆర్కే రాసుకొచ్చారు. తుమ్మల, మండవ లాంటి వలస నాయకులను చేర్చుకుంటే తలెత్తని ఇబ్బంది, షర్మిలను చేర్చుకుంటే ఏ విధంగా నష్టమో ఆర్కే వివరించి వుంటే బాగుండేది.
తుమ్మల, మండవ సామాజిక వర్గాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సామాజిక వర్గం నాయకులు తెలంగాణలో సెటిలై రాజకీయాలు చేసినా ఆర్కేకి సమస్య లేదు. తుమ్మల, మండవలను చేర్చుకోడానికి టీపీసీసీ ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని తహతహలాడుతోంది? అలాగే షర్మిలను వ్యతిరేకించడానికి కారణం ఏంటో ఆర్కే వివరించాలి. కాంగ్రెస్‌ను పసుపు మయం చేయడానికి తప్ప, మరే కారణం షర్మిలను వ్యతిరేకించడానికి కనిపించడం లేదని వైఎస్సార్ అనుచరులు అంటున్నారు. తాజాగా ఆర్కే కాలం గందరగోళం, అయోమయం కలగలిపి సాగింది.
ఈ రాత జగన్ ఇమేజ్‌ను పెంచేలా సాగింది. అలాగే టీపీసీసీకి, తెలుగుదేశానికి నష్టం కలిగించేలా వుందని చెప్పక తప్పదు. ప్రతి వారం జగన్‌పై ఏదో రకంగా విషం చిమ్మాలనే ఆలోచన, అంతిమంగా తాను మేలు చేయాలని భావిస్తున్న పార్టీలకు నష్టం కలిగిస్తోంది. అలాగే జగన్‌కు కీడు కలగాలని కోరుకుంటున్నప్పటికీ, అది ఆయనకు మంచి చేసి పెడుతోందని ఆర్కే గ్రహించాలి.