-నిన్న జోలదరాసి నేడు ఆదినిమ్మాయన పల్లి బ్యారేజీ నిర్మాణం కోసం అనుమతులు.
కుందూనది రాయలసీమలో పుట్టి రాయలసీమలోనే ముగుస్తున్న నది. ప్రతి ఏటా సాదారణ సందర్బాలలో 15-20 TMC లు, అదే పెద్ద వరదలు వచ్చినపుడు 60-70 TMC ల నీటిని తీసుకు వస్తున్న నది కుందూ. కాని ఏమి లాబం ఆ నీరు కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రజలకు దక్కడం లేదు. కారణం కుందూ నీటిని సీమ ప్రజలకు అందించడానికి తగిన రిజర్వాయర్ లు, చక్ డ్యాంమ్ లు నిర్మించక పోవడమే. నిత్యం త్రాగు నీటికి సైతం కట, కట లాడుతున్న కడప ప్రజలకు జిల్లాలోని ఆదినిమ్మాయన పల్లి బ్యారేజి అవసరం ఉంది. ఇప్పటికే అనుమతులు ఉన్న కర్నూలు జిల్లా జొలద రాశి, రాజోలి రిజర్వాయర్ లను పూర్ది చేయాలి. ఆ వైపుగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామం.
కుందూనది ప్రాధాన్యత…
రాయలసీమ ప్రాంతం గుండా క్రిష్ణ, తుంగబద్ర నదులు ప్రవహిస్దాయి. సగటున ప్రతి ఏటా 1100 TMC ల నీటిని రాయలసీమ ప్రాంతం నుంచే తీసుకెలతాయి. అందులో రాయలసీమకు కేటాయించింది కేవలం 133.7 TMC లే. అందులోను తగిన ఏర్పాట్లు లేకపోవడం, శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం నిర్వహించక పోవడం వలన ఆ కొద్ది పాటి నీటిని కూడా వాడుకోలేని దుస్దితి సీమ ప్రజలది. ఉపనది అయిన కుందూ ప్రతి ఏటా అపారమైన నీటిని తీసుకు వస్తుంది.
ఈ నది సీమలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని ఉప్పలపాడు దగ్గర పుడుతుంది. అక్కడి నుంచి సింహ బాగం కర్నూలు జిల్లాలో ప్రవహించి ఖాజిపేట దగ్గర కడప జిల్లాలో పెన్న లో కలిసి పోతుంది. ఏ సహజ న్యాయ సూత్రల ప్రకారం అయిన ఆ నీటిని కచ్చితంగా కర్నూలు, కడప మరియు మిగిలిన రాయలసీమ ప్రజలు వాడుకోవాలి. ప్రదాన నదులైన క్రిష్ణ, తుంగ బద్ర నీటిని సైతం వాడుకోలేక పోతున్న ఈ ప్రాంత ప్రజలకు కుందూనది నీటిని పూర్దిగా అందించడం ప్రభుత్వాల కనీస బాద్యత.
కుందూ సాధన కోసం అలుపెరగని పోరాటం…
కుందూ నీటిని రాయలసీమ ప్రజలకు అందించడానికి ఏలిన పాలకులకు కనీసం DPR ను రూపోందిచే సమయం కూడా దొరక లేదు. ఇలాంటి సందర్బంలోనే 2002 వ సంవత్సరంలో వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో కుందూ నది పోరాట సమితిని ఏర్పాటు చేసి కడప చివరాయకట్టు వరకు నీటిని అందించడం, నదిని జీవ నదిగా మార్చడం లాంటి ప్రదాన డిమాండుతో పోరాటం చేస్తునే ఉన్నారు. వారి పోరాట పలితంగా 2008 లో 0.8 TMC లతో జొలద రాశి, 2.8 TMC లతో రాజోలి రిజర్వాయర్ లకు నాటి ముఖ్యమంత్రి వై యస్ రాజశేకర్ రెడ్డి పాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు శంఖుస్దాపన చేసినారు. కాని వారు చనిపోవడంతో ఆప్రాజెక్టును తర్వాత అధికారన్ని చేపట్టిన ప్రభుత్వాలు పక్కన పెట్టాయి.
పలితం మల్లీ మొదటికి వచ్చింది. కడప జిల్లా రైతుల ప్రయోజనాల కనుగుణంగా ఆదినిమ్మాయన పల్లి బ్యారేజి కోసం రవిశెంకర్ రెడ్డి నాయకత్వంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర ,పోరాటాలు చేసింది. కుందూనది ఉదృతంగా ప్రవహించేటప్పుడు నంద్యాల దగ్గర రాకపోకలు సైతం కష్టం, అంతే కాదు నంద్యాల పట్టణానికి రక్షణ కోసం గోడ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అంటే కుందూనది ఏస్దాయిలో నీటిని తీసుకు వస్తుందో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు.
కుందూ నీటిని పూర్దిగా రాయలసీమ ప్రజలు వాడుకోవాలంటే ఇప్పటికే నిర్మించిన అలగనూరు తో బాటు జొలద రాశి, రాజోలు, ఆదినిమ్మాయన పల్లి దగ్గర బ్యారేజీలను నిర్మించాలి. ఆది నిమ్మాయన పల్లి దగ్గర అయితే ఆంగ్లేయుల కాలంలోనే చిన్నపాటి వంతెన ఏర్పాటు అయింది. దాన్ని బ్యారేజీగా మార్చడం చాల స్వల్ప పని దాదాపు 150 కోట్లతో పని పూర్ది అవుతుంది.
కడప జిల్లాలో పెన్నాలో కలిసిన కుందూ నీరు నేరుగా సోమశిలకు చేరుతుంది. దానికి ఎటువంటి నీటి కేటాయింపు లేకపోయినా కుందూనది నీరు సైతం చేరుతుంది. కనుక ఆ నీటిని మంచి నీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్న మరో రాయలసీమ ప్రాంతం చిత్తూరు జిల్లా. కండలేరు నుంచి కనీసం 10 TMC ల నీరు చిత్తూరు జిల్లా అవసరాల కోసం ఉపయోగించాలి. గాలేరు నగరి ఆలస్యం అవుతున్న నేపద్యంలో ఈ చర్యలు అత్యంత అవసరం.
కడప నగరానికి త్రాగు నీరు మరో 25 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ఆదినిమ్మాయన పల్లి బ్యారేజి నిర్మాణం కోసం DPR రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం వల్ల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఇదే స్ఫూర్తితో ఇప్పటికే అనుమతులు ఉన్న జోలదరాసి , రాజోలు నిర్మాణాలకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండటం మంచి పరిణామం.
కుందూ నీటిని రాయలసీమకు అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న నేపద్యంలో చిత్తూరు జిల్లా ప్రయోజనాల కోసం కుందూ నీరు సోమశిలలో కలుస్తుంది కనుక సోమశిల నుంచి కండలేరు అక్కడి నుంచి మళ్లీమడుగు ప్రాజెక్టు వరకు కాల్వల సామర్థ్యం పెంచి సముద్రంపాలు అవుతున్న నీటిని తిరుపతి డివిజేన్ కు అందించే పనులు వెంటనే చేయాలి. అందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమవంతు పాత్ర పోషించాలి. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రయత్నాలు ఫలిస్థాయి.
గతంలో ఆదినిమ్మాయని పల్లి సాధన పాదయాత్రను రాయలసీమ ఉద్యమ నిర్మాత డా.. యం వీ రమణారెడ్డి గారు ప్రారంబించారు. కుందూ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కామిని వేణుగోపాల్ రెడ్డి , ఆదినిమ్మాయనిపల్లి కోసం పోరాడిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీకి మరియు ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు. రాయలసీమ ప్రజల న్యాయమైన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రజల తరుపున ధన్యవాదాలు.
-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి