ప్రకాశం జిల్లా టీడీపీ నేతల కంపెనీలకు చెందిన మైనింగ్ లీజులను ఇటీవలే ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ పద్ధతిలో మైనింగ్ కు పాల్పడటం, బకాయీ పడటం వంటి కారణాలతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకు సంబంధించిన మైనింగ్ లీజులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై వారు హై కోర్టుకు ఎక్కగా.. ప్రభుత్వ ఉత్తర్వులను హై కోర్టు రద్దు చేయడం గమనార్హం!
గొట్టిపాటి రవి, పోతుల రామారావులకు సంబంధించిన అక్రమాలపై చాలా ఆరోపణలున్నాయి. తెలుగుదేశం హయాంలోనే వాటికి నోటీసులు జారీ అయ్యాయని వార్తలు వచ్చాయి. భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటి విషయంపై లాలూచీలో భాగంగానే గొట్టిపాటి రవి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీలో ఉంటే.. ప్రభుత్వ నోటీసుల ఒత్తిళ్లు తగ్గడంతో పాటు, మైనింగ్ అక్రమాలపై కూడా ప్రశ్న రాదనే ఉద్దేశంతో గొట్టిపాటి రవి పార్టీ మారారు అనే ప్రచారం బలంగా సాగింది.
మైనింగ్ బకాయిలు ఉంటే కట్టేయాలని అప్పట్లో గొట్టిపాటికి జగన్ సలహా ఇచ్చారని కూడా అంటారు. దీంతో ఆయన టీడీపీలోకి చేరి సేఫ్ అయ్యారనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో గొట్టిపాటి టీడీపీ తరఫున పోటీ చేసి నెగ్గారు. అయితే తెలుగుదేశం చిత్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపు నేతల మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అక్రమ మైనింగ్ లు చేపట్టారని, బకాయిలు చెల్లించలేదని వారికి లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే హై కోర్టు మాత్రం ఆ రద్దు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది.