ఆచార్య కథ తనదేనంటూ మీడియాకెక్కిన రాజేష్ పై దర్శకుడు కొరటాల శివ ఫైర్ అయ్యారు. రాజేష్ రాసుకున్న కథకు, ఆచార్య సినిమాలో తను చూపించబోయే కథకు అస్సలు సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆచార్య కాంట్రవర్సీపై కొరటాల స్పందన ఇలా ఉంది.
– అసలు ఇది రాజేష్ కథ కాదు. కానీ ఆ కథే తీస్తున్నానని రాజేష్ అంటున్నారు. నాక్కూడా తెలీదు, చిరంజీవి కూడా ఈ విషయం తెలియకుండా ఆయన కథను మేం తీస్తున్నామంట. రాజేష్ కథను నేను తీయడం లేదని ఆన్ రికార్డ్ చెబుతున్నాను. ఆయన కథతో ఆయన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అసలు ఇక్కడ వివాదమే లేదు. నేను ఒక కథ చెప్పిన తర్వాత, ఆ కథకు దగ్గరగా రాజేష్ కథ కూడా ఉంటే అప్పుడు వివాదం. మరోసారి ఆన్-రికార్డ్ చెబుతున్నాను.. రాజేశ్ రాసుకున్న కథకు, నా ఆచార్య కథకు అస్సలు సంబంధం లేదు.
– ఇది కచ్చితంగా బ్లేమ్ గేమ్. ఈ విషయాన్ని రాజేష్ వదిలేసినా నేను వదలను. దీన్ని పెద్దది చేస్తాను. రాజేష్ కంటే ముందు నేనే కోర్టుకు వెళ్తాను. అంతేకాదు.. ఆయన కోరుకుంటున్నట్టు ఈ విషయం చిరంజీవి గారి దగ్గరకు కూడా వెళ్తుంది. నా అదృష్టం ఏంటంటే.. రెండేళ్ల నుంచి చిరంజీవి గారితో ఈ స్టోరీపై చర్చలు జరుపుతున్నారు. స్టార్టింగ్ నుంచి అన్నీ చిరంజీవికి తెలుసు.
– ఆచార్య షూటింగ్ లో భాగంగా నేను ఉత్సవం మీద పాట తీశానని, అదే ఉత్సవం సెట్ లో ఫైట్ తీశానని రాజేష్ ఆన్-రికార్డ్ ఆరోపిస్తున్నారు. నేను ఇప్పటివరకు అలాంటి పాట తీయలేదు. చిరంజీవి గారి నుంచి టెక్నీషియన్స్ వరకు ఎవరినైనా దీనిపై అడగొచ్చు. రాజేష్ చెబుతున్నట్టు తండ్రీకొడుకులు, దేవాదాయ శాఖ, ఉత్సవం ఫైట్ లాంటి ఎలిమెంట్స్ ఏవీ ఆచార్య సినిమాలో లేవు.
– ఇది తన కథ అంటూ రాజేష్ కోర్టుకు వెళ్లే హక్కు ఆయనకు ఉంది. నేను తీస్తున్న ఆచార్య సినిమా కథకు రాజేష్ కథకు సంబంధం లేదని చెప్పుకోవడం కోసం కోర్టుకు వెళ్లే హక్కు నాక్కూడా ఉంది. ఎందుకంటే నా సినిమాలతో నేను అంతోఇంతో పేరుతెచ్చుకున్నాను. కచ్చితంగా నేను కూడా కోర్టుకు వెళ్తాను.