పాద‌యాత్ర‌ను ఆపండి…లేదా రూట్ మార్చండి!

అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతంలో నిలుపుద‌ల చేయాల‌ని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌వీణ్‌కుమార్‌, ఎస్పీ మ‌లికా గార్గ్‌ల‌కు వైసీపీ ఎమ్మెల్యే…

అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతంలో నిలుపుద‌ల చేయాల‌ని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌వీణ్‌కుమార్‌, ఎస్పీ మ‌లికా గార్గ్‌ల‌కు వైసీపీ ఎమ్మెల్యే టీఆజేఆర్ సుధాక‌ర్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా సుధాక‌ర్‌బాబు మాట్లాడుతూ పాద‌యాత్ర‌కు త‌మ అభ్యంత‌రాలు ఎందుకో వివ‌రించారు.

రైతుల పాదయాత్రలా కాకుండా టీడీపీ రాజకీయ యాత్రగా మార్చి హంగామా చేస్తున్నారని మండిప‌డ్డారు. 157 మందితో పాదయాత్రకు హైకోర్టు అనుమతిస్తే 2 వేల మందితో పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వ‌జ‌మెత్తారు. రైతుల యాత్రకు తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు. కానీ యాత్ర రాజకీయ రంగు పులుముకుందని, దానికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు.

అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ రాజకీయ యాత్రగా మార్చివేసిందని సుధాక‌ర్‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం స్థానిక ఎన్నికలు జ‌రుగుతున్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల మీదగా టీడీపీ పాదయాత్ర మార్చాలని ఆయన కోరారు. స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ప్రాంతంలో పాద‌యాత్ర‌ను అనుమ‌తించొద్ద‌ని ఆయ‌న కోరారు. ఈ మేర‌కు అధికారులు చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. 

ప్ర‌కాశం జిల్లాలో నాలుగు స‌ర్పంచ్ స్థానాలు, 46 వార్డులు, అలాగే 9 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా మ‌హాపాద‌యాత్ర నిర్వ‌హించొద్ద‌ని వైసీపీ డిమాండ్. అధికార పార్టీ డిమాండ్‌పై క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, ఎస్ఈసీ స్పంద‌న ఎలా ఉండ‌నుందో చూడాలి.