జనసేనాని పవన్‌కల్యాణ్ విధించిన డెడ్‌లైన్ గడువు ఈ రోజుకుతో ముగుస్తుంది. జగన్ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరి తర్వాత కార్యాచరణ ఏంటి? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. పవన్‌కల్యాణ్‌లో ఆరంభ శూరత్వమే తప్ప, కొనసాగింపు వుండదనే విమర్శ బలంగా ఉంది. జగన్ ప్రభుత్వానికి ఇటీవల పవన్ విధించిన డెడ్‌లైన్ కూడా అలాంటిదేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలంటూ ఉక్కు పరిరక్షణ సమితి నేతృత్వంలో విశాఖలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. కార్మికులకు మద్దతుగా గత నెల 31న విశాఖలో నిర్వహించిన సభలో జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కారణమైన బీజేపీతో జనసేనకు పొత్తు ఉన్న నేపథ్యంలో… పవన్‌కల్యాణ్ పాల్గొనడం సహజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పవన్‌కల్యాణ్ కీలక ప్రకటన చేస్తారని కార్మికులతో పాటు అన్ని రాజకీయ పక్షాల నాయకులు భావించారు.
అందరి ఆశల్ని వమ్ము చేస్తూ… పవన్ ప్రసంగం సాగింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రంలోని మోడీ సర్కార్‌ను మాట మాత్రం కూడా పవన్ ప్రశ్నించకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రైవేటీకరణను అడ్డుకునే బాధ్యత జగన్ ప్రభుత్వంపై మాత్రమే ఉందంటూ తన అతి తెలివి తేటలను బహిరంగంగా ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీతో చర్చించేందుకు జగన్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత వరకూ ఓకే.
కానీ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసేందుకు డెడ్‌లైన్ విధిస్తున్నానని పవన్ హెచ్చరించడం గమనార్హం. ఈ సందర్హంగా ఒకటి, రెండు రోజులు గడువు ఇస్తున్నానని, ఉక్కు పరిరక్షణ సమితి నేతల సూచనతో వారం రోజులు సమయం ఇస్తున్నట్టు జగన్ ప్రభుత్వా నికి హెచ్చరిక పంపారు. అయితే పవన్ హెచ్చరికను వైసీపీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. పోపోవయ్యా… ఇలాంటి హెచ్చరికలు చాలా చూశాం, చేతనైతే మోడీ సర్కార్‌కు డెడ్‌లైన్ విధించాలని అధికార పార్టీ నేతలు హితవు చెప్పారు.
పవన్ డెడ్‌లైన్ విధించినట్టు… నేటికి ఆ గడువు ముగిసిపోతుంది. తన హెచ్చరికలు ఖాతరు చేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? ఆయన కార్యాచరణ ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఏముంది ఎప్పట్లాగే… డెడ్‌లైన్‌ను గట్టుమీద పెట్టి, తాను సినిమా షూటింగ్‌ల్లో బిజీ అవుతారనే సెటైర్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. నెటిజన్లు అంటున్నట్టు పవన్ అంత నాన్ సీరియస్‌గా ఉంటారా? ఏమో రేపు ఆయన నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూద్దాం!