కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి తల్లీతనయుడు తలనొప్పిగా మారారు. ఆ తల్లి మేనకాగాంధీ, తనయుడు వరుణ్ గాంధీ. వీళ్లిద్దరు ఇందిరాగాంధీ కోడలు, మనవడయ్యే విషయం తెలిసిందే. గతంలో మోడీ కేబినెట్లో మేనకాగాంధీ మంత్రిగా పని చేశారు. జంతు ప్రేమికురాలిగా మేనకాగాంధీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. హూందా రాజకీయాలకు ఆమె మారుపేరు.
ఇటీవల మోడీ సర్కార్ నిర్ణయాలపై మేనకాగాంధీ, వరుణ్‌గాంధీ అసంతృప్తిగా ఉన్నారు. రైతు చట్టాలను వరుణ్‌గాంధీ తప్పు పట్టారు. రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరడం దుమారం రేపింది. రైతుల ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. దీంతో బీజేపీ కార్యవర్గంలో తల్లీతనయుడికి ప్రాధాన్యం దక్కలేదు. ఇది తల్లీతనయుడికి మరింత కోపాన్ని తెప్పించింది. బీజేపీతో గ్యాప్ పెంచింది.
ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై వాహనాన్ని నడిపి పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై వరుణ్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం బీజేపీకి తలనొప్పిగా తయారైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ముఖ్యంగా వరుణ్‌గాంధీ వైఖరి బీజేపీకి నష్టం తెస్తోందనే ఆందోళన ఆ పార్టీ ముఖ్యుల్లో నెలకుంది.
తాజాగా మేనకాగాంధీ మరో డిమాండ్ తెరపైకి తెచ్చారు. పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని మేనకా స్వాగతిస్తూనే… ఇదే మాదిరిగా వంట గ్యాస్ సిలిండర్ ధరలనూ తగ్గించాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ వంట గ్యాస్‌తో పాటు ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.
గతంలో బీజేపీకి లక్షలాది మంది పార్టీ సభ్యులు ఉండేవారన్నారు.. కానీ జిల్లా పరిషత్‌లో ఒక్క స్థానమూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బీజేపీ ఆఫీస్ బేరర్లు ఓటు వేసినా గెలిచేవాళ్లమనీని మేనకా చెప్పడం గమనార్హం.