హైకోర్టును ప్ర‌శ్నిస్తున్నారా సార్‌?

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం పెద్ద నేర‌మైంది. హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే విష‌యాన్ని ప్ర‌శ్నించినందుకు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు…

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం పెద్ద నేర‌మైంది. హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే విష‌యాన్ని ప్ర‌శ్నించినందుకు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రాజధాని మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు చేసిన హెచ్చరికలపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో త‌ప్పు ప‌ట్టారు.  

వైసీపీకి లేని నిబంధనలు అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డొచ్చాయా అని నిలదీశారు. అధికార పార్టీ వాళ్లు విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేయట్లేదా అని ప్రశ్నించారు. కొవిడ్‌ నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డొచ్చాయా అని ఆయన మండిప‌డ్డారు. వైసీపీ ర్యాలీలకు పోలీసులు రెడ్ కార్పెట్‌ వేస్తున్నారని ఆయ‌న గుర్తు చేశారు.  పాదయాత్ర చేస్తున్న వారికి నోటీసులు ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. యాత్రను అడ్డుకోవాలని చూస్తే… ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని ఆయ‌న హెచ్చరించారు.

లోకేశ్ విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లన్నీ హైకోర్టుకు సంధిస్తున్నారా? అని వైసీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. హైకోర్టుకెళ్లి పాద‌యాత్ర‌కు అనుమ‌తి తెచ్చుకున్న విష‌యాన్ని అధికార పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అమరాతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి నిర్వ‌హించ త‌ల‌పెట్టిన మహా పాదయాత్రకు మొద‌ట్లో పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి సానుకూల తీర్పును సాధించారు.  

ఈ సంద‌ర్భంగా హైకోర్టు కొన్ని ష‌ర‌తులు విధించింది. ఉదయం 6 గం.ల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలోనే పాదయాత్ర చేపట్టాలని, త‌మ‌కు సమర్పించిన జాబితాలోని 157 మంది సభ్యులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

అలాగే డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదని, రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌కూడ‌ద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌రి ఇందులో ఏ ఒక్క‌దాన్నైనా అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి పాటిస్తున్న‌దా? అనేది పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

మ‌హాపాద‌యాత్ర మొద‌లు పెట్టి వార‌మైంది. ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వ‌చ్చిందో పాద‌యాత్ర నిర్వాహ‌కులు స‌మాధానం చెప్పాలి. హైకోర్టు విధించిన ష‌ర‌తుల‌ను ఉల్లంఘించ‌డాన్ని ప్ర‌శ్నిస్తే… జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని లోకేశ్ విమ‌ర్శించ‌డం ఏంట‌నే నిల‌దీత‌లు వ‌స్తున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వంపై సాకుతో  హైకోర్టును లోకేశ్ ప్ర‌శ్నిస్తున్నారా? అని వైసీపీ నేత‌లు అడుగుతున్నారు. దీనికి ఆయ‌న స‌మాధానం ఏంటో మ‌రి!