అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు జగన్. అలా రెండున్నరేళ్లు అవిశ్రాంతగా పనిచేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీపై కాస్త దృష్టి తగ్గించారు. పార్టీ వ్యవహారాలను, బాధ్యతలను.. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లకు అప్పగించి, తాను పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టిపెట్టారు.
కానీ ఇప్పుడు జగన్ పార్టీపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఎన్నికలకింకా రెండున్నరేళ్లే మిగిలి ఉంది. జగన్ పాలనకు ప్రజలు వందకు వంద మార్కులేయొచ్చు కానీ.. అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, గెలుపు గుర్రాలకు గుర్తింపునివ్వడం, పార్టీ వ్యవహారాలను పూర్తిగా గాడిలో పెట్టడం ఇప్పటినుంచే మొదలవ్వాలి. దానికి తగ్గట్టే జగన్ ఇప్పుడు రెడీ అవుతున్నారు.
మంత్రివర్గ విస్తరణ..
పార్టీపై జగన్ ఫోకస్ పెంచారనడానికి మంత్రి వర్గ విస్తరణే తొలి అడుగు కాబోతోంది. తొలి విడతలో చాలామంది కొత్తవారికే అవకాశమిచ్చారు జగన్. మలి విడతలో పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని ప్రక్షాళణ చేయబోతున్నారు.
పార్టీ కోసం కష్టపడినవారికి, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారనుకున్నవారికి ఏరికోరి పదవులివ్వబోతున్నారు. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణతో జగన్ ఆలోచనా ధోరణి మరింత స్పష్టంగా తెలుస్తుంది.
కార్యకర్తలకు గుర్తింపు
పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలను గుర్తించి, వాళ్లకు న్యాయం చేయాలని నిర్ణయించారు జగన్. ప్రతి మండలం నుంచి 10 మంది కార్యకర్తల్ని ఎంపిక చేసి వాళ్లకు మేమున్నాం అనే భరోసా ఇవ్వాలనుకుంటున్నారు.
అలా నియోజకవర్గానికి వంద మంది కార్యకర్తల్ని ఎంపిక చేసి వాళ్లను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకునే ప్రయత్నం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు, ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించారు.
ఇంచార్జీల మార్పు..
జగన్ తర్వాత పార్టీ అంటే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. మాత్రమే కనిపిస్తున్నారు. సీనియర్లు మంత్రులున్నా కూడా వారికి ఇతర ప్రాంతాల్లో వేలు పెట్టే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఈ ముగ్గురూ మూడు ప్రాంతాల రాజకీయ వ్యవహారాలకు బాధ్యులుగా ఉన్నారు.
ఎన్నికల వేళ.. వీరికి పనిభారం తగ్గించొచ్చు లేకపోతే పూర్తిగా మార్పులు చేర్పులు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇకపై జగన్ సమక్షంలోనే పంచాయితీ
కీలకమైన కొన్ని ప్రాంతాల్లో పార్టీలో అంతర్గత విబేధాలున్నాయి. ఇకపై వాటన్నింటినీ ప్రత్యక్షంగా తనే పరిష్కరించాలని జగన్ నిర్ణయించారు. గతంలో గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో.. వల్లభనేని వంశీని ఇతర గ్రూపుల్ని తానే స్వయంగా కలిపారు జగన్. అయితే ఇంకా అపరిష్కృతంగా చాలా గొడవలున్నాయి.
వచ్చే ఎన్నికల్లో అవి కచ్చితంగా పార్టీ విజయాలపై ప్రభావం చూపిస్తాయి. చీరాల నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో విభేదాలు.. ఇలాంటివన్నీ ఇకపై జగన్ టేబుల్ పైనే పరిష్కారం అవుతాయి.
నివేదికలు..సర్వేలు
మంత్రులు, అధికారుల పనితీరుపై ఇన్నాళ్లూ నివేదికలు తెప్పించుకున్న జగన్, ఇప్పుడు తనపై తానే నివేదిక తయారుచేసుకోబోతున్నారని తెలుస్తోంది. సర్వేలు కూడా చేయించుకోబోతున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ మొదలవుతుంది.
మొత్తమ్మీద జగన్ ఇప్పటివరకూ పాలనపైనే దృష్టి పెట్టారు, ఇప్పుడు పార్టీకి కూడా అంతే సమయం కేటాయించబోతున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా తనకు జనాదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు జగన్.