భాజపా రాజకీయం చేస్తుందా?

అయోధ్య రామజన్మభూమి వివాదం సమసిపోయింది. వివాదాస్పద స్థలం రామమందిర నిర్మాణానికే చెందుతుందని విస్పష్టమైన తీర్పు వచ్చింది. ఒకటిరెండు ముస్లిం సంస్థలు తప్ప.. దేశంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. మనం…

అయోధ్య రామజన్మభూమి వివాదం సమసిపోయింది. వివాదాస్పద స్థలం రామమందిర నిర్మాణానికే చెందుతుందని విస్పష్టమైన తీర్పు వచ్చింది. ఒకటిరెండు ముస్లిం సంస్థలు తప్ప.. దేశంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. మనం గ్రహించాల్సినది ఏంటంటే… ఈ తీర్పును రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ గౌరవిస్తున్నాయి. ఆ రకంగా రాజకీయంగా ఒక మంచి వాతావరణం ఏర్పడిఉంది. ఆ వాతావరణాన్ని కలుషితం చేసేయడమా? లేదా? అనేది ప్రస్తుతం భాజపా చేతుల్లో ఉంది. ఈ తీర్పు, దాని పర్యవసానంగా జరగగల రామమందిర నిర్మాణం అనేది తమ పార్టీ ఘనతగా ప్రచారం చేసుకోవడానికి భాజపా అత్యుత్సాహం కనబరిస్తే గనుక.. దేశంలో నెలకొని ఉన్న సామరస్య వాతావరణానికి పాతర వేసేసినట్లు అవుతుంది.

భాజపా అప్పుడే అలాంటి దురాగతానికి తెగబడుతోంది. ‘రామాలయం నిర్మిస్తాం’ అని మేం ముందునుంచి చెబుతున్నాం.. అని అక్కడికేదో తమ పార్టీ తరఫున ఆలయం కట్టబోతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. అలాగే. మా హయాంలోనే ఇలాంటి తీర్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. అనేది కూడా దుర్మార్గమైన మాట. అక్కడికేదో వీళ్లే ఆ తీర్పునకు కారణభూతులైనట్లుగా మాట్లాడుతున్నారు.

మా హయాంలోనే మందిర నిర్మాణం జరుగుతుండం సంతోషం. వచ్చే ఎన్నికల్లో మా ప్రచారాంశం కూడా ఇదే.. అని భాజపా నాయకులు చెబుతుండడం.. దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసేలా ఉంది. మతాన్ని తురుపుముక్కగా వాడుకోవడంలో భాజపా దుడుకుతనం ఎవ్వరికీ తెలియని సంగతి కాదు. అయితే ఇంత సున్నితనమైన అంశాన్ని రాజకీయం చేయడమే ఘోరం. ముస్లిం ల సదవగాహన, సామరస్య వైఖరి వల్ల మాత్రమే ప్రస్తుతం తీర్పు అనంతర వాతావరణం ప్రశాంతంగా ఉంది. దీనినుంచి రాజకీయ లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తే గనుక.. యావత్ దేశాన్ని నాశనం చేయడానికి, విద్వేషాలను రెచ్చగొట్టడానికి వారు కంకణం కట్టుకున్నట్టే.