ఆర్జీవీ చెలరేగిపోయినట్లే, ఆ పాట వింటే అనిపించేది అదే. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ ఈనెలాఖరులో అందించబోతున్న సినిమాలో పాట అంటూ వదిలిన డిజిటల్ కంటెంట్ తెగ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పాట లిరికల్ చాలా ఫన్నీగా, సెటైరికల్ గా వుండడం పెద్ద ప్లస్ అయింది. పైగా హిట్ ట్యూన్ తీసుకుని ఈ పాట రాయించడం కూడా క్లిక్ అయింది.
పాట, సాహిత్యం, ట్యూన్ సంగతి అలా వుంచితే, పాట విడియో కోసం కట్ చేసి వేసిన అనేక విడియో బిట్ లు సినిమా మీద ఆసక్తి పెంచేలా వున్నాయి. రాజకీయ సినిమాలు లైక్ చేసేవాళ్లు, లేదా వర్తమాన రాజకీయాలు పరిశీలించేవారికి ఈ విడియో కట్ లు చూస్తే, కచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి పెరుగుతుంది.
సిరాశ్రీ రాసిన పాటకు రవిశంకర్ సంగీతం అందించారు. పాట విడుదల చేసిన రోజే ఏ విధమైన హడావుడి చేయకుండానే, వన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం, ట్రెండింగ్ నెంబర్ వన్ కావడం విశేషం. వర్తమాన పాత్రలకు సరిపడా నటులను ఎక్కడెక్కడి నుంచో ఏరి, వెదికి తేవడంలో వర్మ దిట్ట. ఈ పాటలో కనిపించిన అనేక పాత్రలు ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసాయి.