చంద్రబాబు, పవన్ భేటీపై విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఆ వేడి తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతోంది. టీడీపీ, జనసేన కలయిక రాజకీయంగా ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో విమర్శల తీవ్రతే తెలియజేస్తోంది. అయితే పవన్‌పై ప్రత్యర్థులైన వైసీపీ నేతల విమర్శల కంటే… దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ జనసేనను బాగా డ్యామేజీ చేస్తోంది.
టీడీపీ, కాపు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ రామ్‌గోపాల్ వర్మపై ఆగ్రహాన్ని ప్రదర్శించడమే ఇందుకు నిదర్శనం. పవన్‌పై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్, దానిపై కాపు నేతల ఆగ్రహం ఏంటో తెలుసుకుందాం.
“కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు” అని వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు. దీనిపై కాపు సంఘం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను కించపరిస్తే సహంచేది లేదని, పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఐక్య కాపునాడు, జాతీయ కాపునాడు, అఖిల భారత కాపు సమాఖ్య తదితర సంఘాల నాయకులు హెచ్చరించడం గమనార్హం.
పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే వీరికి అభ్యంతరం లేదట! అందులోకి కాపు జాతిని తీసుకొస్తేనే అభ్యంతరమని వారు చెప్పు కొచ్చారు. సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని గంపగుత్తగా చంద్రబాబుకు కాపు, బలిజ ఓట్లను అమ్ముతున్న పవన్‌ను ఏమీ అనకుండా, నిజం చెప్పిన దర్శకుడు ఆర్జీవీపై ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరంగా వుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు, పవన్‌ల నుంచి కాపుల ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం ఎలాగో కాపు నేతలు ఆలోచిస్తే మంచిదని పలువురు హితవు చెబుతున్నారు. పవన్ అమ్మకాన్ని అడ్డుకోకపోతే…. శాశ్వతంగా కాపు, బలిజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుకు తమ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టే పవన్‌కు కుల నాయకులు మద్దతుగా నిలవడం… కాపుల ఖర్మ కాకపోతే మరేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.