మెగా కాంపౌండ్ కు మళ్లీ దగ్గరైన పూరి

ఉన్నట్టుండి సడెన్ గా మెగా కాంపౌండ్ లో ప్రత్యక్షమయ్యాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈరోజు జరిగిన చిరంజీవి కొత్త సినిమా పూజా కార్యక్రమంలో కనిపించాడు. కేవలం రావడం కాదు, ఈ సినిమాకు ఆయన ప్రత్యేక…

ఉన్నట్టుండి సడెన్ గా మెగా కాంపౌండ్ లో ప్రత్యక్షమయ్యాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈరోజు జరిగిన చిరంజీవి కొత్త సినిమా పూజా కార్యక్రమంలో కనిపించాడు. కేవలం రావడం కాదు, ఈ సినిమాకు ఆయన ప్రత్యేక అతిథి. 

పూజా కార్యక్రమాల్లో భాగంగా కెమెరా స్విచాన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్ కు చాలామంది దర్శకులొచ్చారు కదా? మరి పూరి ఒక్కడే ఎందుకు ప్రత్యేకం?

గతంలో చిరంజీవి, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు. దానికి ఆటోజానీ అనే టైటిల్ కూడా పెట్టారు. ఫస్టాఫ్ నెరేషన్ కూడా అద్భుతంగా వచ్చిందన్నారు. కానీ ఆ ప్రాజెక్టు పక్కకెళ్లిపోయింది. 

సెకెండాఫ్ నచ్చక చిరంజీవి దాన్ని పక్కనపెట్టారు. అప్పట్లో ఈ వ్యవహారంపై పూరి అసంతృప్తి వ్యక్తంచేశాడు. తనకు చెప్పకుండా, మీడియాకు ఆ విషయం చెప్పడాన్ని అవమానంగా ఫీలయ్యాడు. తనకు చెబితే మరో వెర్షన్ రాసుకొని వచ్చేవాడినంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తంచేశాడు.

అప్పట్నుంచి మెగా కాంపౌండ్ కు పూరి జగన్నాధ్ దూరం అంటూ చాలా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ మేటర్ అంతా మరిచిపోయారు. పూరి కూడా చిరుతో సినిమా కోసం ప్రయత్నాలు చేసినట్టు కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు చిరంజీవితో కనిపించాడు పూరి జగన్నాధ్. 

ఏకంగా చిరు సినిమా ఓపెనింగ్ కు వచ్చాడు. దీంతో చిరు-పూరి కాంబినేషన్ పై మరోసారి గాసిప్పులు మొదలయ్యాయి. ఈసారి పూరికి చిరంజీవి కచ్చితంగా అవకాశం ఇస్తారంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. 

మరోవైపు ఇదే ఓపెనింగ్ లో మరో ఇద్దరు కూడా కలిసినట్టు టాక్. గతంలో హరీశ్ శంకర్, చార్మి మధ్య అభిప్రాయబేధాలొచ్చినట్టు కథనాలొచ్చాయి. ఈరోజు జరిగిన చిరు సినిమా ఓపెనింగ్ లో వాళ్లిద్దరూ నవ్వుతూ పలకరించుకున్నారు.