తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తేల్చేసింది. ఏ చిన్న అవకాశం దొరికినా కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతిపక్షాలకు కేసీఆర్ ప్రభుత్వం మరో ఆయుధాన్ని అందించింది.
‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రిగా ప్రభుత్వ విధానాన్ని చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. యాసంగి పంటల సాగుపై ఆయన ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటన వివాదాస్పదమవుతోంది. రైతులను నట్టేట ముంచేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ కేంద్రం వైఖరి వల్లే ఈ విధమైన ప్రకటన చేయాల్సి వస్తోందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం వల్లే తాము కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ తప్పిదమనే అంటున్నారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని ఆయన కోరారు.
కానీ ప్రతిపక్షాలు మరోలా విరుచుకుపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వల్ల రైతులు వరికి బదులు ఉరి వేసుకోవాల్సి వచ్చిందని రైతులను రెచ్చగొడుతున్నాయి. అసలే ఉప ఎన్నికలో ఓటమితో రగిలిపోతున్న టీఆర్ఎస్ నేతలకు ప్రతిపక్షాల విమర్శలు పుండు మీద కారం చల్లినట్టవుతోంది. తాజా ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్ ప్రభుత్వం రైతు, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన తేలిపోతోంది. ఇది నిజమే అయినప్పటికీ ఆల్రెడీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.