విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులకు ప్రత్యేక స్ధానం ఉంది. గతంలోనూ వారి పూర్వీకులు మంత్రులుగా మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
ఇక ప్రస్తుత తరంలో మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు 2004లో కాంగ్రెస్ తరఫున రాజకీయ అరంగేట్రం చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో మూడు పార్టీలు మారారు.
బొబ్బిలి రాజులు స్వతహాగా కాంగ్రెస్ వైపే ఉండేవారు. అలాంటిది తొలిసారి 2017లో మంత్రి పదవి కోసం వైసీపీ నుంచి సజయకృష్ణ రంగారావు సైకిలెక్కడంతోనే ఆయన రాజకీయ పలుకుబడి ఒక్కసారిగా తగ్గిపోయింది.
బొబ్బిలిలో హ్యాట్రిక్ వీరుడు కాస్తా 2019 ఎన్నికలలో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత నుంచి ఆయన రాజకీయంగా చురుకుదనం తగ్గించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఆయన చంద్రబాబు పర్యటనలో దర్శనమిస్తున్నారు. 2024 ఎన్నికలలో ఆయన పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం బొబ్బిలి సీటును ఆయన సోదరుడు బేబీ నాయనకే ఇస్తారని ప్రచారం సాగుతోంది.
టీడీపీ విపక్షంలో ఉన్నపుడు బేబీ నాయన బొబ్బిలిలో పార్టీ తరఫున పోరాటం చేశారని, అందుకే ఆయన పేరునే బాబు ఖరారు చేస్తారని అంటున్నారు. దీంతో మాజీ మంత్రి రాజకీయానికి బాబు మార్క్ చెక్ పెట్టేశారని అంటున్నారు.