తెలంగాణలో జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తిని కరోనా బలి తీసుకొంది. ఈ నెలాఖరులో రిటైర్మెంట్ కావాల్సిన అధికారిని కరోనా బలి తీసుకోవడం తీవ్ర విషాదం నింపింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజాము ప్రాణాలు విడిచారు.
కరీంనగర్ సవరన్ స్ట్రీట్ దక్షిణామూర్తి స్వస్థలం. 1989 బ్యాచ్‌కు చెందిన దక్షిణామూర్తి వరంగల్ జిల్లాలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. ఆయన పలు కీలక కేసుల ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. నక్సల్స్ ఆపరేషన్స్‌తో పాటు వరంగల్‌లో సంచలనం సృష్టిం చిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్కౌంటర్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స అనంతరం కోలుకుని విధుల్లో చేరిన పోలీసులకు ఘనస్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపడంలో దక్షిణామూర్తి ఎంతో చొరవ చూపారు. కరోనాకు భయపడాల్సిన పనిలేదని ఆయన చెబుతూ తన సిబ్బందిలో పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతూ వచ్చారు. కాగా ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సిన దక్షిణామూర్తి మృత్యువాత పడడం ఇటు కుటుంబ సభ్యులు, అటు డిపార్ట్మెంట్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.