ఆచార్య…మరో కాపీ ఆరోపణ

ఇక్కడ ఎవ్వరినీ ఎవ్వరూ విమర్శించనక్కరలేదు. టాలీవుడ్ లో అంతే..అంతే అనేసుకోవడమే. మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా కథ మీద కాపీ ఆరోపణలు గుప్పు మంటున్నాయి. మొన్నటికి మొన్న ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల…

ఇక్కడ ఎవ్వరినీ ఎవ్వరూ విమర్శించనక్కరలేదు. టాలీవుడ్ లో అంతే..అంతే అనేసుకోవడమే. మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా కథ మీద కాపీ ఆరోపణలు గుప్పు మంటున్నాయి. మొన్నటికి మొన్న ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల కాగానే ఆ టీజర్ సీన్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకున్న స్టోరీ పేపర్ బయటకు వచ్చింది.

అనిల్ అనే దర్శకుడు ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్న కథలో పేజీ అది. ఆ కథ, ఆచార్య కథ ఒకటో కాదో తెలియదు కానీ ఆ పేజీలో వున్న కంటెంట్, ఫస్ట్ లుక్ ఒక్కలాగే వుండడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ ఆ డైరక్టర్ పాపం, సైలంట్ గా వుండిపోయారు. ఆయనకు ఈ విషయంలో కోర్టుకు లాగుతాం, పరువునష్టం కేసు వేస్తాం అని బెదిరింపులు కూడా ఎదురైనట్లు బోగట్టా.

ఇదిలా వుండగానే, మరో అప్ కమింగ్ డైరక్టర్ తన కథను మొత్తం కొట్టేసారంటూ పేద్ద ప్రకటనను సోషల్ మీడియాలోకి వదిలారు. ఒకప్పటి టాప్ డైరక్టర్ బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే వ్యక్తి తన కథను మైత్రీ మూవీస్ జనాలకు వినిపిస్తే, తనకు తెలియకుండానే వేరే దర్శకుడి దగ్గరకు వెళ్లిపోయి, ఆచార్య సినిమాగా మారిపోయిందని తెలిసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ రాజేష్ మండూరి అనే అసోసియేట్ దర్శకుడు తన నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ద్వారా మైత్రీ మూవీస్ నిర్మాత రవికుమార్, సిఇఓ చెర్రీలకు పరిచయం అయ్యారు. కథలు ఏమైనా వున్నాయా అంటే తాను ఓ భారీ కథ చెప్పానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాను చెప్పిన లైన్ మైత్రీ రవికుమార్ కొంత విన్నారని, సిఇఓ చెర్రీ మిగిలినదంతా విని, రికార్డు కూడా చేసుకున్నారని తెలిపారు. ఇదంతా 2018 చివర్లో జరిగిందని వివరించారు.

కానీ ఆ తరువాత ఎన్నికలు రావడం, తాను చెన్నయ్ వెళ్లి వేరే ప్రొడ్యూసర్ కు ఈ కథ చెప్పి, బాలకృష్ణతో తీయడానికి ఒప్పించడం వంటివి జరిగాయన్నారు. ఈ లోగా ఆచార్య సినిమా సంగతి తెలిసిందని వెంటనే ఈ ఏడాది జనవరిలో రైటర్స్ అసోసియేషన్ పరుచూరి గోపాలకృష్ణను కలిసి విషయం చెప్పానన్నారు.  అదే నెల 6న మైత్రీ మూవీస్ మీద, ఆ దర్శకుడి మీద ఫిర్యాదు చేసా అన్నారు. 

అన్ని ఆధారాలు వున్నా కూడా రైటర్స్ అసోసియేషన్ ఏ చర్యా తీసుకోకుండా, కోర్టుకు వెళ్లమని లేఖ ఇచ్చేసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కథ రిజిస్ట్రేషన్ కోసం వేలాది రూపాయలు తీసుకున్న సంస్థ ఇలా వన్ సైడ్ గా వ్యవహరించడం దారుణమని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆఖరికి ఇదే విషయాన్ని గొట్టిపాటి రవి దృష్టికి తీసుకెళ్లినా, తానేం చేయలేనని, లీగల్ వెళ్లాలంటే వెళ్లమని చెప్పేసారన్నారు.