తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కరోనాబారిన పడ్డారు. రెండు రోజులుగా స్వల్ప కరోనా లక్షణాలతో నలతగా ఉండ డంతో కరుణాకర్‌రెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు బుధవారం నిర్ధారణ అయింది. దీంతో ఆయన ట్రీట్‌మెంట్ కోసం తిరుపతిలోని రుయా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు.
రాయలసీమలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా పేరు పొందిన రుయాలో ట్రీట్‌మెంట్ తీసుకోవడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై ఓ పాజిటివ్ మెసేజ్ పంపాలనే ఆశయంతో అక్కడికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రతిదీ ప్రజల వైపు నుంచి ఆలోచించడం కరుణాకర్‌రెడ్డి ప్రత్యేకత. కరోనా రోగులు చనిపోతే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్తసంబంధీకులు కూడా ముందుకు రాని అమానవీయ పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం.
ఈ మహమ్మారి రాక్షసత్వానికి మానవత్వం కనుమరుగవుతోందనే ఆవేదనతో అలాంటి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా దాని బారిన పడే అవకాశమే లేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు….ఆయనే స్వయంగా అంత్య క్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. తద్వారా మానవత్వాన్ని బతికించే ప్రయత్నం చేశారు. అలాగే కరోనా విపత్తులో సాటి మనిషి పట్ల దయాగుణంతో మెలగాలనే సందేశాన్ని ఇచ్చేందుకు రెండు రోజుల క్రితం కుష్ఠు వ్యాధిగ్రస్తుని స్వయంగా నగరంలో తిప్పుతూ అతనికి సాయం అందించేలా చేశారు.
నాయకుడంటే మాటల మనిషి కాదు…చేతల మనిషని నిరూపించే మరో చర్యకు కరుణాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కరోనాకు ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు రుయాలో చేరి సామాన్య ప్రజల్లో ఒకరిగా ఆయన నిలిచారు. కరోనా పాజిటివ్ అనగానే ప్రజాప్రతినిధులు, ఆర్థికంగా స్తోమత ఉన్నవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరుణాకర్‌రెడ్డి అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం అభినందనీయమని తిరుపతి నగర ప్రజలు ప్రశంసిస్తున్నారు.