నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నిత్యం వార్తల్లో ఉండడం వ్యసనంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇది కాస్త తనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత మరింత పెరిగింది. జగన్ ప్రభుత్వంపై వెటకారం దట్టించి ఏదో చెప్పాలనుకుని, మరేదో అవుతుంటారాయన. సమాజ ఛీత్కారాలు, ప్రత్యర్థుల సవాళ్లు తదితరాలేవీ పట్టించుకోకపోవడం ఆయన ప్రత్యేకతగా గిట్టని వాళ్లు చెబుతుంటారు.
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్‌కల్యాణ్…ఈ ఏడేళ్లలో ప్రశ్నించడడాన్ని ఎవరూ చూడలేదు, వినలేదు. కానీ ఆ పని నరసా పురం ఎంపీ రఘురామ అవిశ్రాంతంగా చేస్తుండడం గమనార్హం. తనకు ఎంపీ టికెట్ ఇచ్చి, ఢిల్లీకి పంపిన సొంత పార్టీని మాత్రమే నిత్యం ప్రశ్నించడం, నిలదీసేంత గొప్ప కృతజ్ఞతా భావం ఉన్న నాయకుడు రఘురామ.
అంతెందుకు, ఎంపీలంటే తనకు రఘు రామ మాత్రమే గుర్తొస్తారని అంతటి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఇటీవల అన్నారంటే… రఘురామ రేంజ్ ఏంటో అర్థం చేసు కోవచ్చు. తనకు ఓట్లు వేసి ఢిల్లీలోని అత్యున్నత చట్ట సభకు పంపించిన ప్రజలను నేరుగా కలుసుకోలేని ధైర్యశాలి మన రఘురామ. ఇలా ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే రోజులు, గంటలు చాలవు.
ఇక ప్రస్తుతానికి వస్తే రఘురామ మీడియాతో మాట్లాడుతూ మరో సంచలన ఆరోపణ చేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌నకు రెక్కీ నిర్వహించారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఇదే విషయమై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు రఘురామ వెల్లడించారు. ఏపీ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానన్నారు.
ఇంతకూ రఘురామ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏమొచ్చింది? ఇప్పుడీ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొంపదీసి ఈయన గారి బాధను భరించలేక కొన్ని రోజులు అదృశ్యం కావాలని కుటుంబ సభ్యులు అనుకోలేదు కదా? అని ప్రత్యర్థులు సెటైర్లు విసురుతున్నారు.