కోర్టుల్లో వరుసగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ లో కూడా అసంతృప్తి నెలకొందనే మాట వాస్తవం. విధాన పరమైన నిర్ణయాలకు, ప్రజలకు మేలు చేకూర్చే చట్టాలకు కూడా ప్రతిపక్షం అడ్డు తగులుతూ.. కోర్టులను అడ్డం పెట్టుకుని కాలయాపన చేస్తుంటే ఎవరైనా ఏంచేస్తారు చెప్పండి. న్యాయ విచారణ కొనసాగినంత కాలం పథకాల అమలు ఆగిపోతే చివరికి నష్టపోయేది ప్రజలు, పేదలే. ఇవన్నీ తెలిసి కూడా జగన్ సంయమనం పాటిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో జరుగుతున్న ఆలస్యం గురించి ఆయన స్పందించిన తీరే దీనికి నిదర్శనం.
ఈ ఏడాది మార్చి నుంచి పట్టాల పంపిణీ వాయిదా పడుతూనే వస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని అడ్డుకుంటూ చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి తమాషా చూస్తున్నారు. ఉగాది నాటికి తొలివిడత మొదలు కావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ పురోగతి లేదు. అటు లే-అవుట్లు సిద్ధం చేసి, లాటరీ తీసి, క్షేత్ర స్థాయిలో అంతా సిద్ధం చేశారు రెవెన్యూ అధికారులు. ఇటు కోర్టు తీర్పు రాకపోవడంతో పదే పదే ఈ ప్రక్రియ వాయిదా పడి అధికారుల్లో కూడా నైరాశ్యం నెలకొంది.
వీరందరికీ డీమోరలైజ్ కావొద్దని సూచించారు సీఎం జగన్. అధికారులతో జరిగిన సమీక్షలో.. ఆయన ఇళ్ల పట్టాల పంపిణీపై స్పందించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరకు మంచే గెలుస్తుందని, దేవుడు సహకరిస్తాడని, ఈరోజు కాకపోయినా ప్రజలకు మంచి చేసే రోజు అతి త్వరలోనే వస్తుందని అన్నారు. ఆ మంచి రోజు వచ్చేలోపు మనం నిరాశ చెందకూడదని, పక్కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టేందుకు సిద్ధం కావాలని సూచించారు.
లేఅవుట్స్ లో మొక్కలు నాటి మరింత సుందరంగా తయారు చేయాలని ఆదేశించారు. ఐదేళ్ల అధికారంలో తాను చేయలేని పనుల్ని జగన్ చకచకా చేస్తుంటే చంద్రబాబు కుళ్లుకుంటున్నారు. అందుకే పదే పదే సంక్షేమ పథకాల అమలుకి అడ్డు తగులుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కూడా చంద్రబాబు మోకాలడ్డారు. అయితే జగన్ మాత్రం ఎక్కడా ఆవేశానికి లోనుకాకుండా.. అన్నిటినీ ఆలోచనతోనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తన సహనంతోనే ప్రత్యర్థిని గట్టిదెబ్బ కొట్టబోతున్నారు.