ఆ ఒక్క రోజు మైక్ కట్ చేయకుండా ఉండాల్సింది

ఈ రోజుతో జగన్ చేసిన చారిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కనివినీ ఎరుగని రీతిలో జగన్ చేసిన ఈ పాదయాత్ర, ఆయన్ను నేరుగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.…

ఈ రోజుతో జగన్ చేసిన చారిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కనివినీ ఎరుగని రీతిలో జగన్ చేసిన ఈ పాదయాత్ర, ఆయన్ను నేరుగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. దీనికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ నడుస్తోంది.

అయితే అదే సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఆ ఒక్క రోజు మైక్ కట్ చేయకుండా ఉంటే ఏపీ రాజకీయాలు మరోలా ఉండేవనేది ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్.

ఆ రోజు ఏం జరిగింది?

అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. చివరికి ఊరుపేరు లేని ఎమ్మెల్యేల చేత కూడా జగన్ ను తిట్టించారు. ఓవైపు వ్యక్తిగతంగా తనపై జరుగుతున్న దాడుల్ని ఎదుర్కొంటూనే, మరోవైపు బాబు సర్కార్ చేస్తున్న అవినీతిని, అరాచక పాలనను అసెంబ్లీ వేదికగా ఎండగడుతూ వచ్చారు జగన్.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా, ఏపీ రాజకీయాల్లో అప్పటివరకు కనివినీ ఎరుగని రీతిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి మైక్ ను కూడా కట్ చేయడం స్టార్ట్ చేశారు చంద్రబాబు. తను నియమించిన స్పీకర్ కోడెల సహాయంతో జగన్ ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేశారు.

అలా ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్రకు పాల్పడ్డారు. అప్పటివరకు ప్రజాసమస్యల్ని ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలోనే లేవనెత్తాలని భావించిన జగన్ కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతుక వినిపించడం అసాధ్యమని తేలిపోయింది. ఇక మిగిలింది ప్రజాక్షేత్రమే.

అసెంబ్లీలో తమ గొంతుక వినిపించకుండా చేయడంతో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు జగన్. అసెంబ్లీ బదులు, ప్రజల మధ్యనే తన గొంతు వినిపించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టాలని తీర్మానించారు. ఆ నిర్ణయమే ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు నాంది పలికింది.

బాబు అరాచక పాలనకు ముగింపు పలికింది. 6 నెలలు పాదయాత్ర చేయాలనుకున్న జగన్.. ఏకంగా 341 రోజులు, 3648 కిలోమీటర్లు.. పాదయాత్ర సాగించారంటే ఆయన ఎంత గట్టిగా నిర్ణయం తీసుకున్నారో అర్థమౌతుంది.

ఆ నాడు అసెంబ్లీలో మైక్ ను కట్ చేయడమే, జగన్ తీసుకున్న పాదయాత్ర నిర్ణయానికి పునాదిగా చెబుతారు. ఇదే ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆరోజు జగన్ మైక్ కట్ చేయకుండా ఉంటే, ఈరోజు ఆయనకు ఇంత అఖండ మెజారిటీ వచ్చి ఉండేది కాదని, చంద్రబాబుకు ఇంత గడ్డు పరిస్థితి ఎదురయ్యేది కాదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.