దేనికైనా ఓ హద్దు ఉంటుంది. రాజకీయంగా ఎన్ని పిచ్చి వేషాలైనా వేయొచ్చు కానీ సున్నితమైన అంశాలపై, ప్రజల మనోభావాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే విషయాలపై సంయమనం పాటించడం ఎవరికైనా అవసరం. దీన్నే స్వీయ నియంత్రణ అని కూడా అంటాం. కానీ ఆంధ్రజ్యోతికి ఇలాంటి తేడాలు అస్సల్లేవు. తన రాజకీయాల కోసం, తన పలుకబడి కోసం ఎంతకైనా తెగిస్తుంది ఈ ఛానెల్. ఈరోజు అలాంటిదే ఓ బుద్ధిలేని పని చేసి, అందరితో చీవాట్లు తింటోంది.
అయోధ్యపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. దశాబ్దాలుగా నలుగుతున్న అత్యంత సున్నితమైన అయోధ్య-బాబ్రి మసీదు వ్యవహారంపై కీలక తీర్పు ఇది. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటుచేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఇలాంటి కీలకమైన సమయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఆన్ లైన్ లో పోలింగ్ పెట్టింది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి.
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును మీరు సమ్మతిస్తారా అంటూ సిగ్గులేకుండా సర్వే పెట్టిన ఈ ఛానెల్ పై నెటిజన్లు భగ్గుమన్నారు. పరమత సహనాన్ని పాటించే భారతదేశంలో ఇలాంటి రెచ్చగొట్టే సర్వేలు పెట్టడానికి సిగ్గులేదా అంటూ వరుసపెట్టి కామెంట్లు పెట్టారు. అయినా ఏమాత్రం సిగ్గుపడకుండా దాదాపు గంట పాటు సర్వేను అలానే కొనసాగించారు. 5వందల మందికి పైగా ఇందులో పాల్గొన్నారు కూడా.
సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన పోలీసుల దృష్టికి ఈ విషయం వెళ్లింది. వాళ్లు రంగంలోకి దిగి హెచ్చరించడంతో సదరు సర్వేను తొలిగించింది ఏబీఎన్. దీనిపై ప్రస్తుతం ఆన్ లైన్ లో పెను దుమారం చెలరేగుతోంది. రాధాకృష్ణను అరెస్ట్ చేయాలంటే నెటిజన్లు భగ్గుమంటున్నారు. వెంటనే ఆ సోషల్ మీడియా ఎకౌంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మీడియా స్వేచ్ఛ ఆధారంగా తనకు నచ్చిన అంశంపై ఆన్ లైన్ పోల్ పెట్టుకునే హక్కు ఏ ఛానెల్ కైనా ఉంటుంది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్వీయనియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఏపీ రాజకీయాలపై, సీఎం జగన్ పై ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టుగానే, అలవాటుప్రకారం సుప్రీంతీర్పుపై కూడా వ్యవహరించింది ఏబీఎన్.
ఆన్ లైన్ లో పెట్టిన పోలింగ్ ను డిలీడ్ చేసినప్పటికీ ఏబీఎన్ పై చర్యలు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశభద్రతకు, సామరస్యానికి విఘాతం కలిగేలా వ్యవహరించిన ఆ ఛానెల్ పై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.