చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి 1995, సెప్టెంబర్ 1న ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 28 ఏళ్లు గడిచాయి. చంద్రబాబుకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు బాగా అలవాటైన విద్య. కానీ బాబు సీఎంగా బాధ్యతలు తీసుకుని 28 ఏళ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని టీడీపీ ఎలాంటి హడావుడి చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దీని వెనుక కారణం ఏంటని ఆరా తీయగా… వెన్నుపోటు ఉదంతాన్ని గెలికినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిసింది. 1995, ఆగస్టులో ఎన్టీఆర్‌ను సీఎంగా పదవీచ్యుతుడిని చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారు. పదవీ కాంక్షతో సొంత అల్లుడే వెన్నుపోటు పొడిచిన వైనాన్ని ఎన్టీఆర్ ఎంతో ఆవేదనతో వివరించారు. చంద్రబాబును తిట్టని తిట్టు లేదు.
ఇప్పుడు నాటి రోజుల్ని గుర్తు చేసుకోవడం ద్వారా రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువనే ఉద్దేశంతో టీడీపీ దాదాపు మౌనాన్ని పాటిస్తోంది. బాబు సీఎంగా మొదటిసారి బాధ్యతలు తీసుకుని 28 ఏళ్లైందని సంబరాలు చేసుకుంటే, సోషల్ మీడియా, ప్రత్యర్థులు మాత్రం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అప్పుడే మూడు దశాబ్దాలు అవుతుందా? అని వెటకరిస్తాయి. అందుకే అలాంటి విమర్శలకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రచారం చేసుకోవడం లేదనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబు కూడా తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయన గుంభనంగా వున్నారు. లేదంటే ఈ పాటికి సీఎంగా చంద్రబాబు అంటూ ఎల్లో మీడియాలో విపరీతంగా కథనాలు వచ్చేవి. అలాంటివేవీ లేవంటే వెన్నుపోటు జ్ఞాపకాలు చంద్రబాబును కూడా వెంటాడుతున్నట్టుగా భావించాలేమో!