రాష్ట్రంలోనూ, దేశంలోనూ చట్టసభల్లో జనసేనకు ప్రాతినిథ్యం లేదు. ఏపీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా సీఎం జగన్‌కు జై కొట్టిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఒక పార్టీకి విలువ ఎప్పుడు వుంటుందంటే… చట్టసభల్లో ప్రాతినిథ్యం వున్నప్పుడు మాత్రమే. దీన్ని బట్టి జనసేనకు ఏపాటి విలువ వుంటుందో అంచనా వేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకే దేశం, ఒకే ఎన్నికపై కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన సాధ్యాసాధ్యాలపై తేల్చడానికి కమిటీని కూడా మోదీ సర్కార్ నియమించింది.
ఈ నేపథ్యంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే ప్రధాని మోదీ ఆలోచనను జనసేన మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు శుభపరిణామం అని పవన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ బలమైన సంకల్పానికి అన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తుందని పవన్ ఆకాంక్షించడం గమనార్హం.
ఏపీలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ తానున్నానంటూ పవన్‌కల్యాణ్ అత్యుత్సాం చూపారు. మోదీపై తన విశ్వాసాన్ని చాటుకునేందుకే పవన్ ముందస్తు ప్రకటనలు చేశారనే చర్చకు తెరలేచింది. పవన్‌కల్యాణ్ మద్దతుతో మోదీ సర్కార్‌కు పనిలేదు. అయితే గియితే జగన్ ప్రభుత్వం మద్దతును కేంద్రం తప్పకుండా అడుగుతుంది.
బీజేపీకి మిత్రపక్షమే అని తాను చెప్పుకోడానికే జమిలి ఎన్నికలకు పవన్ జై కొట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే కనీస అవగాహన కూడా లేని పవన్‌కల్యాణ్‌కు ఎన్నికలు ఎప్పుడొస్తే ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇతర పార్టీల పల్లకీ మోయడానికి ఆయన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టుగా పవన్ ప్రకటన చూస్తుంటే అర్థమవుతోందని కొందరు అంటున్నారు.
మొత్తానికి ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే చందంగా…ఒక్క సీటు లేకపోయినా తన మద్దతును పవన్ ప్రకటించడంపై జనం నవ్వుకుంటున్నారు.