కన్వీనరును తేల్చాలంటే కూడా వారికి భయమే!

మోడీని ఓడించాలి.. మరోసారి మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలి.. అనే మాట తప్ప వారికి మరొక లక్ష్యం లేదు. ప్రజాసేవ, దేశపరిరక్షణ విషయంలో ఎన్ని ప్రవచనాలు చెప్పినా.. వాటి వెనుక ఉండే చోదకసూత్రం మాత్రం…

మోడీని ఓడించాలి.. మరోసారి మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలి.. అనే మాట తప్ప వారికి మరొక లక్ష్యం లేదు. ప్రజాసేవ, దేశపరిరక్షణ విషయంలో ఎన్ని ప్రవచనాలు చెప్పినా.. వాటి వెనుక ఉండే చోదకసూత్రం మాత్రం మోడీని ఓడించాలనే లక్ష్యమే. వారందరూ ఒక్క జట్టుగా అయితే ఏర్పడ్డారు గానీ.. కలసి కట్టగా మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారు. 

ఇప్పటికి మూడుసార్లు భేటీ అయిన విపక్షాలు.. కనీసం కన్వీనరును నియమించుకోలేని అపరిపక్వ ఐక్యగానం ఆలపిస్తున్నాయి. కన్వీనరుగా ఒక పేరు ప్రకటిస్తే.. ఎందరిలో అసంతృప్తులు రేగుతాయో.. ఈ కూటమి ఇప్పుడే శిథిలమైపోతుందో అని జడుసుకుంటున్నారు. మొత్తానికి సమన్వయ కమిటీ అనే ముసుగులోనే కూటమి కార్యకలాపాలు అన్నింటినీ సాగించాలని వారు నిర్ణయించుకున్నారు. తాజాగా రెండురోజుల పాటు ముంబాయిలో జరిగిన ఇం.డి.యా. కూటమి భేటీలు ఉమ్మడిగా పోరాడాలనే పాత లక్ష్యాన్నే పునర్నిర్దేశించుకున్నాయి.
 
ముంబాయిలో జరిగిన సమావేశాల్లో 28 పార్టీలకు చెందిన 63 మంది నాయకులు పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు విషయం తేల్చకపోవడం గురించి తర్వాత.. కనీసం కూటమికోసం ఒక లోగో ఉండాలనే విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. తయారుచేసిన లోగోలు పలువురు మార్పులు సూచించాక ఆ మేరకు తర్వాత ఫైనలైజ్ చేయాలని అనుకున్నారు. ఇన్నిగొంతులు వేరువేరుగా ధ్వనిస్తున్న ఈ కూటమి భేటీలను గమనిస్తే..  అసలు వీరు ఐక్యంగా ముందుకు సాగడం జరిగేపనేనా అనిపిస్తుంది.

నిజానికి ఈ కూటమి పార్టీల్లోనే రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే.. వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కూటమి బంధం అన్ని ఎన్నికలకూ వర్తించేంత పటిష్టమైనదనే నమ్మకం వారికి కూడా లేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే కలిపసి పోటీచేయాలనే పరిమిత లక్ష్యంతోనే వీరు ముందుకు సాగుతున్నారు. అయితే ఆ పార్లమెంటు ఎన్నికలకు కూడా నష్టం జరగకుండా సీట్ల సర్దుబాటు చేసుకోగలరా? అనేదే ప్రశ్న. 

నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు ఫార్ములా తయారవుతుందని అంటూనే, మరోవైపు సాధ్యమైనంత వరకు ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని సన్నాయి నొక్కులు నొక్కడం వీరి అనైక్యతకు నిదర్శనం. జుడేగా భారత్ జీతేగా ఇండియా అంటూ నినాదాన్ని అందంగా తయారుచేశారే గానీ.. ముందు ఈ కూటమిలోని పార్టీలన్నీ సమైక్యంగానే ఉన్నట్టు వీళ్లు ప్రజల ఎదుట తమ చేతలతో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
 
కన్వీనరు పోస్టును చాలా మంది ఆశిస్తున్నారు గనుక.. ఏకాభిప్రాయం రాదని భయపడుతున్న వాళ్లు.. ఎన్నికల తర్వాతనైనా ఇప్పుడు కనిపిస్తున్న ఐక్యత పటాపంచలైపోవచ్చునని ఎందుకు ఆలోచించలేకపోతున్నారనేది ప్రశ్న.