బాబు, లోకేశ్ ఆదేశాలను ఆమె లెక్క చేయ‌లేదు

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు భూమా అఖిల‌ప్రియ త‌మ అధినేత‌ల ఆదేశాల‌ను లెక్క చేయ‌డం లేదు. నంద్యాల‌కు వెళ్లొద్ద‌ని, ఆళ్ల‌గ‌డ్డ‌కే ప‌రిమిత‌మై టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని గ‌తంలో అఖిల‌ప్రియ‌ను చంద్ర‌బాబు, లోకేశ్ ఆదేశించారు.…

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు భూమా అఖిల‌ప్రియ త‌మ అధినేత‌ల ఆదేశాల‌ను లెక్క చేయ‌డం లేదు. నంద్యాల‌కు వెళ్లొద్ద‌ని, ఆళ్ల‌గ‌డ్డ‌కే ప‌రిమిత‌మై టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని గ‌తంలో అఖిల‌ప్రియ‌ను చంద్ర‌బాబు, లోకేశ్ ఆదేశించారు. అయిన‌ప్ప‌టికీ ఆమె లెక్క‌చేయ‌కుండా, వారితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం.

జ‌న‌వ‌రి 8న భూమా నాగిరెడ్డి జ‌యంతి. ఈ సంద‌ర్భంగా భూమా అఖిల‌ప్రియ తాను ఇన్‌చార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆళ్ల‌గ‌డ్డ‌లో కాకుండా, నంద్యాల‌కు వెళ్లి హ‌డావుడి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అఖిల‌ప్రియ వైఖ‌రిపై నంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, అదే ప‌ట్ట‌ణంలో ఉంటున్న మాజీ మంత్రి ఫ‌రూక్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గంతో అఖిల‌కు ప‌నేంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

త‌న తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా ఘాట్‌కు వెళ్లిన అఖిల‌ప్రియ‌…త‌ల్లిదండ్రుల‌కు పూల‌దండ‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నంద్యాల‌లో నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. భూమా అఖిల‌ప్రియ‌, ఆమె సోద‌రుడైన మాజీ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి వేర్వేరుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అఖిల‌ప్రియ ఆధ్వ‌ర్యంలో రెండు తోపుడు బండ్ల పంపిణీ, అలాగే ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. బ్ర‌హ్మానంద‌రెడ్డి విష‌యానికి వ‌స్తే మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించి విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.  

అఖిల‌ప్రియ త‌ర‌చూ నంద్యాల‌కు వెళ్లి బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఫ‌రూక్‌తో సంబంధం లేకుండా రాజ‌కీయాలు చేయ‌డంపై వారు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ విష‌య‌మై చంద్ర‌బాబు, లోకేశ్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఆళ్ల‌గ‌డ్డ‌కే పరిమితం కావాల‌ని, నంద్యాల‌కు వెళ్లొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాల‌ను ఆమె లెక్క‌చేయ‌లేదు. ఆళ్ల‌గ‌డ్డ‌లో నెమ్మ‌దిగా అఖిల‌ప్రియ ప‌ట్టుకోల్పోయింది. త‌న‌కు కాకుండా మ‌రొక‌రికి టికెట్ ఇస్తార‌నే భ‌యం ప‌ట్టుకుంది. ఆ ఒత్తిడిలో ఆమె టీడీపీ అధిష్టానంపై ఇటీవ‌ల ఘాటు కామెంట్స్ చేసింది.

ఆళ్ల‌గ‌డ్డ‌లో తాను ఏం చేసినా, అలాగే కేసులు పెట్టినా టీడీపీ పెద్ద‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారామె. తాను ఓ కార్య‌క‌ర్త‌గా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇదే ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదైనా జ‌రిగితే ఎక్క‌డెక్క‌డి నుంచో పార్టీ పెద్ద‌లంతా వాలిపోతార‌ని, త‌న‌ను మాత్రం ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆక్రోశం వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నంద్యాల‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు అఖిల‌ప్రియ త‌న అన్న బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఎస‌రు పెట్టింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నంద్యాల‌లో అన్నాచెల్లి మ‌ధ్య నడుస్తున్న పోరు టీడీపీ శ్రేణుల్లో గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తోంది. ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు, లోకేశ్ నాయ‌క‌త్వ అస‌మ‌ర్థ‌త‌ను బ‌య‌ట‌ప‌డుతోంద‌ని చెప్పొచ్చు.

వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ప‌రిధికి మించి నోరు పారేసుకోవ‌డంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని నియ‌మించారు. ఇదే అఖిల‌ప్రియ విష‌యానికి వ‌స్తే… ఆమెకు చంద్ర‌బాబు, లోకేశ్ భ‌య‌ప‌డుతున్నార‌ని నంద్యాల టీడీపీ శ్రేణుల అభిప్రాయం. ఇలాగైతే నంద్యాల‌లో టీడీపీ నామ‌రూపాలు లేకుండా పోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న చెందుతున్నారు. నంద్యాల టీడీపీ బాధ్యులెవ‌రో తేల్చాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ఆల‌స్య‌మైతే శాశ్వ‌తంగా దెబ్బ‌తింటామ‌ని టీడీపీ శ్రేణుల అభిప్రాయం. మ‌రి అధిష్టానం ఇప్ప‌టికైనా జోక్యం చేసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుందో, లేదో చూద్దాం.