Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Analysis

అమ్మ‌కానికి కాపు ఓట్లు...సంప్ర‌దించండి ప‌వ‌న్‌ను!

అమ్మ‌కానికి కాపు ఓట్లు...సంప్ర‌దించండి ప‌వ‌న్‌ను!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపు, దాని అనుబంధ కులాలు అత్యంత ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వు. అధికారాన్ని శాసించ‌గ‌ల‌వు. కానీ స్వాతంత్ర్యం వ‌చ్చిన మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ కాపు, బ‌లిజ‌, అనుబంధ కులాల నేత‌లు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి నోచుకోలేదు. కేవ‌లం నాలుగైదు శాతం ఓటు బ్యాంక్ క‌లిగిన రెడ్లు, క‌మ్మ నేత‌లు మాత్ర‌మే అధికారాన్ని చెలాయిస్తున్నారు. వీరి ప‌ల్ల‌కీలు మోసే నాయ‌కులుగా మాత్ర‌మే తాము మిగిలిపోతున్నామ‌నే ఆవేద‌న‌, ఆక్రోశం కాపుల్లో వుంది.

వారి బాధ అర్థం చేసుకోద‌గ్గ‌దే. సీఎం కావాల‌న్న వారి ఆకాంక్ష‌లో న్యాయం వుంది. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టిన‌ప్పుడు ఆ సామాజిక వ‌ర్గం అండ‌గా నిలిచింది. సున్నిత మ‌న‌స్కుడైన చిరంజీవి మొర‌టు రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేక‌పోయారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జారాజ్యాన్ని విలీనం చేసి, కేంద్రంలో మంత్రి ప‌ద‌వితో చిరంజీవి శాశ్వ‌తంగా రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పారు. ఆ త‌ర్వాత 2014లో జ‌న‌సేన పేరుతో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో వ‌చ్చారు. అంత‌కు ముందు ప్ర‌జారాజ్యం అనుబంధ విభాగ‌మైన యువ‌రాజ్యం అధినేత‌గా ప‌వ‌న్‌కు రాజ‌కీయ అనుభ‌వం ఉంది.

అయితే సొంతంగా తానే పార్టీని స్థాపించి, ఈ కుళ్లు రాజ‌కీయాల‌ను మార్చేస్తాన‌ని స‌రికొత్త గొంతుక వినిపించారు. వ‌చ్చీ రాగానే టీడీపీ -బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చి, వాటి గెలుపు కోసం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఏపీలో టీడీపీ-బీజేపీ కూట‌మి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత ఆ రెండు పార్టీల‌తోనూ విడిపోయారు. 2019లో సొంతంగా పోటీ చేసి.... చివ‌రికి తాను గెలిచిన రెండుచోట్ల కూడా గెల‌వ‌లేక చ‌తిక‌ల‌ప‌డ్డారు. కాలం గిర్రున తిరుగుతోంది. మ‌రో 15 నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఎలాగైనా త‌మ వాడిని ముఖ్య‌మంత్రిగా చూసుకోవాల‌ని కాపుల ఆకాంక్ష రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. ప‌వ‌న్‌ను త‌మ సామాజిక వ‌ర్గం ప్ర‌తినిధిగా కాపులు చూసుకున్నారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోగా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉన్న ప‌వ‌న్ త‌ప్ప‌, మ‌రొక కాపు నాయ‌కుడు సీఎం స్థాయి ఇమేజ్‌ను సంపాదించుకోలేర‌నేది వారి అభిప్రాయం. జ‌న‌సేన‌ను కాపు సామాజిక వ‌ర్గం త‌మ‌దీ అని సొంతం చేసుకుంది. ఈ మాట ఎందుకు రాయాల్సి వ‌స్తోందంటే...ఇటీవ‌ల జ‌న‌సేన నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్ బీఆర్ఎస్‌లో చేరారు. ఆ పార్టీ ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తోట చంద్ర‌శేఖ‌ర్ నిఖార్సైన కాపు నాయ‌కుడు.

తోట‌కు బీఆర్ఎస్ ప‌గ్గాలు అప్ప‌గించ‌గానే... బీజేపీ, జ‌న‌సేన కాపు నాయ‌కులు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, శివ‌శంక‌ర్ త‌దిత‌రులంతా విమ‌ర్శ‌ల‌కు దిగారు. కేవ‌లం జ‌న‌సేన ఓట్ల‌ను చీల్చి, జ‌గ‌న్‌కు ల‌బ్ధి క‌లిగించేందుకే తోట చంద్ర‌శేఖ‌ర్‌కు బీఆర్ఎస్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నేది వారి ఆరోప‌ణ‌. అంటే జ‌న‌సేన బ‌లం కాపు, బ‌లిజ‌ల ఓట్లు అని వారు చెప్ప‌క‌నే చెప్పారు. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఒక అడుగు ముందుకేసి... తాను బీజేపీ అనే సంగ‌తి మ‌రిచిపోయి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అండ‌గా నిలుస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాపు, బ‌లిజ‌ల ఓట్ల పునాదుల‌పైనే జ‌న‌సేన న‌డుస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెనుక కాపులున్నార‌నే ఉద్దేశంతోనే చంద్ర‌బాబు ఆయ‌న్ను మ‌చ్చిక చేసుకుంటున్నారు.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ రెండో సారి భేటీ కావ‌డంతో కాపు, బ‌లిజ‌ల ఆశ‌ల‌న్నీ ఆవిర‌య్యాయి. త‌న సామాజిక వ‌ర్గం ఓట్ల‌న్నీ చంద్ర‌బాబుకు గంప‌గుత్త‌గా అమ్మ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇవి కేవ‌లం ఆరోప‌ణ‌లే కాదు... కాపు, బ‌లిజ‌, వాటి అనుబంధ కులాల ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం. ప‌వ‌న్ సీఎం కావాల‌ని వారంతా కోరుకుంటుంటే... ఆయ‌న మాత్రం చంద్ర‌బాబు కోసం ప‌రిత‌పిస్తున్నార‌నేది వాస్త‌వం. త‌న‌ను న‌మ్ముకున్న వారి ఓట్ల‌ను చంద్ర‌బాబు వ‌ద్ద అమ్మ‌కానికి పెట్టార‌నే విమ‌ర్శ‌లు ప‌వ‌న్‌పై ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదేంటంటే...

"కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు" అని దిమ్మ‌తిరిగే ట్వీట్ చేశారు. ఇది ఏపీ పౌర స‌మాజ ఆలోచ‌న‌ను, కాపుల ఆవేద‌నను ప్ర‌తిబింబిస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కాపు, బ‌లిజ‌ల ఓట్లు అత్య‌ధికంగా ఉన్నాయ‌నేది కాదు ఇక్క‌డ లెక్క‌. వారికి నాయ‌క‌త్వం వ‌హించే నాయ‌కుడు ఎంత తెలివైన వాడ‌నేదే ప్ర‌ధానం. నాలుగు శాతం ఓట్లున్న క‌మ్మోళ్ల‌కు వ‌ర్మ అభినంద‌న‌లు చెప్ప‌డాన్ని స‌ర‌దాగా తీసుకోవ‌ద్దు.

వ‌ర్మ ట్వీట్ చూసిన త‌ర్వాత‌... 15 శాతం ఓట్లున్న కాపుల‌ను కొన‌గ‌లిగే తెలివితేట‌లున్న చంద్ర‌బాబు త‌మ‌కు నాయ‌కుడ‌ని క‌మ్మోళ్లు సంబ‌రాలు చేసుకుంటుంటారు. అలాగే ఇంత బ‌లం ఉండి...త‌మ‌కు వ‌ర్మ సంతాపం తెలిపే దుస్థితికి దిగ‌జారామా? అని కాపు, బ‌లిజ ప్ర‌జానీకం ఆవేద‌న‌తో రోదిస్తోంటోంది. న‌మ్మితేనే మోసపోతామ‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ప‌వ‌న్‌ను న‌మ్మి, ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన , నిల‌వాల‌ని అనుకున్న కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గంలోని మెజార్టీ జ‌నాన్ని అమ్మ‌డానికి ఇంత‌కంటే మంచి త‌రుణం లేద‌ని ప‌వ‌న్ కాచుక్కూచున్నారు.

చంద్ర‌బాబు ఎంత తెలివైన వాడంటే...ఏపీ అంతా తిరిగి కాపు, బ‌లిజ‌, వాటి అనుబంధ ప్ర‌జానీకాన్ని మ‌చ్చిక చేసుకోవ‌డం కంటే ...ప‌వ‌న్‌నే కొంటే, అంద‌రినీ భేరం ఆడిన‌ట్టు అవుతుంద‌ని భావించార‌నే టాక్ న‌డుస్తోంది. ఇక్క‌డ కొంటున్న వాడు, అమ్ముతున్నవాడు అంతా ఖుషీ. మ‌ధ్య‌లో బాధ‌ప‌డేదెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాపు ఓట్లు అమ్మ‌కానికి రెడీ... సంప్ర‌దించాల్సిన చిరునామా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన అధ్య‌క్షుడు. ఇక్క‌డ ష‌ర‌తు వ‌ర్తిస్తుంది...కేవ‌లం చంద్ర‌బాబుకు మాత్ర‌మే అమ్మ‌బ‌డును.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?