మైక్ పట్టుకుంటే లీకులివ్వడం చిరంజీవికి అలవాటైపోయింది. రంగస్థలం సినిమా నుంచి చిరంజీవి ఇలా ఏదో ఒక అంశంపై సినిమాలకు సంబంధించి లీకులిస్తూనే ఉన్నారు. చివరికి వాల్తేరు వీరయ్య సినిమా గురించి కూడా ఆ మధ్య కొన్ని లీకులు ఇచ్చేశారు. అయితే ఈసారి మాత్రం ఆ లీకుల్ని సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నాడు దర్శకుడు బాబి.
'మెగా మాస్ పార్టీ' పేరిట వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో గ్రాండ్ గా చేశారు. అందరూ మాట్లాడేశారు. చివరిగా చిరు వంతు వచ్చింది. మైక్ పట్టుకున్నారు చిరంజీవి. వెంటనే వెనక ఉన్న బాబి అలెర్ట్ అయ్యాడు. 30 నిమిషాలకు పైగా మాట్లాడిన చిరు, తన ఫ్లోలో కొన్ని లీక్స్ వదిలే ప్రయత్నం చేశారు.
అయితే చిరంజీవి అలా చేసిన ప్రతిసారి వెనక నుంచి మెల్లగా టచ్ చేస్తూ, బాబి వాటిని అడ్డుకున్నాడు. అలా ఒకసారి, రెండు సార్లు కాదు.. దాదాపు 4-5 సందర్భాల్లో చిరంజీవిని సున్నితంగా వారించాడు బాబి. 'చిరులీక్స్' కు అడ్డుకట్ట వేశాడు.
ఓ సందర్భంలో చిరంజీవి సినిమా కథ చెప్పడం స్టార్ట్ చేశారు. మొదటి 25 నిమిషాలు ఎలా ఉంటుందో వివరించడం మొదలుపెట్టారు. 2 యాక్షన్ బ్లాక్స్ వస్తాయని కూడా చెప్పేశారు. వెంటనే అలర్ట్ అయిన బాబి, మెల్లగా చిరంజీవిని తాకి ఆయన లీక్స్ ను అడ్డుకున్నాడు.
మరో సందర్భంలో రవితేజ పాత్రను, తామిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్ని ఫ్లోలో చెప్పేయబోయారు చిరంజీవి. ఈసారి బాబితో పాటు రవితేజ కూడా చిరంజీవిని అడ్డుకున్నారు. అన్నీ చెప్పేయొద్దంటూ వారించారు.
'రొటీన్' రచ్చ అందరికీ తెలిసిందే..
ఇప్పటికే చిరంజీవి చేసిన ఓ కామెంట్ పై చాలా చర్చ నడుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అన్నారు చిరు. అయినప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. అయితే ఆ 'రొటీన్' అనే పదాన్ని మాత్రం చాలామంది పట్టుకున్నారు.
చిరు ఇచ్చిన ఆ స్టేట్ మెంట్, సినిమాను కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు దానికితోడు లీక్స్ కూడా వస్తే మరింత డ్యామేజీ జరుగుతుంది. అందుకే మెగా మాస్ పార్టీలో 'చిరు లీక్స్' లేకుండా జాగ్రత్తపడ్డాడు బాబి.