Advertisement

Advertisement


Home > Politics - Opinion

పట్టుకోల్పోతున్న పవన్!

పట్టుకోల్పోతున్న పవన్!

జగన్ వ్యతిరేక ఓటును ఒక్కటైనా చీలనివ్వకుండా చేసి.. జగన్ ను ద్వేషించే ప్రభుత్వం ఏర్పాటు కావడంలో తాను కీలక పాత్ర పోషిస్తానని పవన్ కల్యాణ్ కు నమ్మకం. 2019 అనుభవం ఇంకా పచ్చి గాయంలాగా సలుపుతున్నప్పటికీ కూడా.. తాను చిటికెవేస్తే చాలు అఖిలాంధ్ర ప్రజానీకం తాను చెప్పిన గుర్తుకు ఓట్లు వేసేస్తారని కూడా నమ్మకం! పవన్ కల్యాణ్ ‘యూఎస్పీ’ అయిన నిలకడలేనితనం ఇప్పుడు ఆయన వ్యూహం బెడిసికొట్టేలా చేస్తోంది. ఈ నిలకడ లేని వైఖరి వల్ల.. ఈ మౌలికమైన రోగానికి ఉండే అనుబంధ రుగ్మతల వల్ల.. ఇన్నాళ్లూ ఆయన వెంటఉన్న పార్టీ నాయకులు కూడా నమ్మకాన్ని కోల్పోతున్నారు. కోటలు దాటే మాటలే తప్ప.. చేతల వరకు వచ్చేసరికి తుస్సుమనిపిస్తున్న వైఖరితో పవన్ కల్యాణ్ నెమ్మదిగా సొంత పార్టీ మీద పట్టుకోల్పోతున్నారు!

తెలుగు ప్రజల మీదనైనా ఆయన తన పట్టు నిలుపుకుంటున్నారా? కోల్పోతున్నారా? అనే ప్రశ్న ఉదయిస్తోందా? ఊహాజనితమైన ప్రశ్నలకు ఇక్కడ చోటులేదు! పవన్ కల్యాణ్ ప్రాభవం మసకబారడం మీదనే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.

మామూలుగానే సినిమా హీరోలకు తాము సూపర్ హీరోలం అనే నమ్మకం ఉంటుంది. పైగా కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన హీరోలు ఆ ట్రాన్స్ లో ఉండిపోతారు. తాము కూడా మామూలు మనుషులం అనే సంగతి మర్చిపోతారు. దివినుంచి దిగివచ్చాం అనుకుంటారు. సినిమా లొకేషన్ సెట్ లలో షూటింగ్‌ సమయంలో ‘షాట్ ఓకే’ అనే అరుపు వినిపించిన ప్రతిసారీ.. చుట్టూ మూగిన క్రూ మరియు భజనగాళ్లు అందించే అభినందనలకు, ప్రశంసలకు అలవాటు పడి.. అదంతా నిజమే అనుకుంటారు. బాహ్యప్రపంచంలోకి అడుగుపెడితే వేలం వెర్రిగా ఎగబడే జనం, తాము మాట్లాడితే విజిల్స్, తాము చేయి అందిస్తే కేరింతలు కొట్టే వారిని చూసి.. తాము మానవాతీత శక్తులం అనుకుంటారు. 

పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి భ్రమలకు అతీతమైన వ్యక్తి కాదు. ఓట్లు వేసే సమయంలో డబ్బుకు అమ్ముడుపోయే వాళ్లు.. సభలో తన ప్రసంగానికి విజిల్స్ కొట్టగానే మరింత పూనకం తెచ్చుకుని మాట్లాడే వ్యక్తి తాను చిటికెలో ప్రపంచాన్ని మార్చేయగలనని అనుకోవడం వింత కాదు. అయితే ఆ భ్రమల విషయంలో ఆయన వాస్తవిక దృక్పథంలోకి రావాల్సిన అవసరం ఉంది. సొంత పార్టీ మీద, పార్టీలోని నాయకుల మీద (?), ప్రజల అభిమానం మీద  ఆయన పట్టు కోల్పోతున్నారనే సంగతి ఆయన గుర్తించాలి. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మెరుగ్గా దిద్దబాటు చర్యలు చేపట్టవచ్చు. 

నిలకడలేని తనానికి ప్రతీక..

పవన్ కల్యాణ్ కు అపియరెన్స్ లోనే ఒక మేనరిజం ఉంది. ఆయన స్థిరంగా నిలబడలేరు. సినిమాలలో నటిస్తున్నప్పుడు కూడా అలా కదులుతూ ఉంటారు. ఆయనను ఇమిటేట్ చేస్తూ ఎవరైనా స్పూఫ్ లు చేస్తున్నప్పుడు.. ఇలా కదులుతూ ఉంటే చాలు.. పవన్ కల్యాణ్ అని అర్థమైపోతుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో గానీ.. రాజకీయ వేదికల మీద కూడా ఇలాగే నిలకడ లేకుండా కదులుతూ ఉంటారు. సర్లెద్దూ… సినిమాలు చేసి చేసి ఆ మేనరిజం అలవాటైపోయింది అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఆ నిలకడలేని తనం అనేది ఆయన బాడీలాంగ్వేజ్ లోని మేనరిజం మాత్రమే కాదు. ఆయన వ్యక్తిత్వంలోనే, ఆలోచన సరళిలోనే ఒక భాగం అయిపోయిందని చాలా లోతుగా గమనిస్తే మాత్రం అర్థం కాదు. ఇప్పుడు క్రమక్రమంగా ప్రజల్లో పట్టుకోల్పోతుండడానికి అదే ప్రధాన కారణం. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక సందర్భంలో రాష్ట్రానికి చెందిన ఓ కీలక బిజెపి నేతతో ప్రెవేటు సంభాషణలో పవన్ కల్యాణ్ గురించి వాకబు చేసినప్పుడు.. ‘ప్రజల్లో బాగా క్రేజ్ ఉన్న నాయకుడే గానీ.. నిలకడలేదు’ అని వ్యాఖ్యానించారంటే ఆయనకున్న క్రెడిబిలిటీ అర్థమవుతుంది. ఇదేదో యథాలాపంగా చేసే వ్యాఖ్య కాదు. తొలినుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే అదే అర్థమవుతుంది. 

2014కు పూర్వం జగన్మోహన్ రెడ్డిలాగా.. సమైక్యాంధ్ర వాదనకు స్థిరంగా కట్టుబడిన వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రమే. అప్పట్లోనే ఆయన పార్టీ పెట్టారు. కానీ 2014 ఎన్నికలు వచ్చేసరికి రెండు కళ్లు సిద్ధాంతంతో రెండు నాల్కల ధోరణి అప్పటిదాకా అవలంబించిన చంద్రబాబునాయుడు భజనకు దిగజారిపోయారు. మొత్తానికి తాను పార్టీ పెట్టిన కొత్తల్లో తాన వాస్తవ స్వరూపం తెలియక నమ్మేటువంటి కాపు వర్గం, అభిమానవర్గం ఓట్లన్నీ తెలుగుదేశానికి ధారాదత్తం చేసి చంద్రబాబును సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు. 2019 ఎన్నికలు వచ్చేసరికెల్లా చంద్రబాబు ఆయనకు విలన్ గా కనిపించాడు. ఆయనతో కటీఫ్ చెప్పేశారు. 2014 ఎన్నికల్లో తాను బాగా ఊదిన బిజెపి-- రాష్ట్రద్రోహిగా ఆయనకు కనిపించింది. 

2019కెల్లా పూర్తిగా సొంతంగా రాష్ట్రమంతా పోటీచేశాడు. ఎంత లేకి వ్యూహాలను అనుసరిస్తాడంటే.. జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉంటుందనే అనుమానంతో.. యూపీ వెళ్లి మాయావతిని కీర్తించి, ఆమె భజన చేసి ఆమె పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కొన్ని రిజర్వుడు సీట్లను ఆ పార్టీఇచ్చి వారితో పొత్తులతో పోటీచేశారు. ఎస్సీ ఓట్లన్నీ బీఎస్పీకి పడతాయని తద్వారా జగన్ ఓడుతారని, చంద్రబాబుకు లార్జెస్ట్ పార్టీగా, తనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా సీట్లు వస్తాయని కలగన్నారు. అత్యంత ఘోరంగా స్వయంగా రెండుచోట్ల ఓడిపోయారు. గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా ఆయన మీద నమ్మకం లేక దూరమయ్యాడు. ఈ పరిస్థితిలో.. బిజెపిలో ఏం సానుకూల అంశం కనిపించిందో.. అర్జంటుగా వెళ్లి వారితో పొత్తు పెట్టుకున్నాడు. తాను ఎన్డీయేలో భాగస్వామి అంటాడు. ఎన్నడూ రాష్ట్ర బిజెపితో కలిసి పనిచేయడు. తీరా ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు భజనకు సిద్ధమవుతున్నారు. తన వైఖరికి ‘ఓటు చీలనివ్వకపోవడం’ అనే అందమైన ముసుగు వేసుకున్నారు. ఆ బిజెపితో కలిసి ఉంటారో లేదో మాత్రం.. ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంచేశారు. 

ఇదంతా నిలకడలేనితనం గాక మరేమిటి? అందుకే ఆయనను ప్రజలు నమ్మడం లేదు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆయన చిత్తశుద్ధి మీద పెద్ద అనుమానాలు అవసరం లేదు. కానీ ఒక పార్టీగా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చి నిలకడైన మేలు చేస్తారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. ప్రజలకి నమ్మకం పోవడం ఒక ఎత్తు. ఇన్నాళ్లూ ఆయనను నమ్ముకుని ఉన్న, ఆయన మీద పెట్టుబడి కూడా పెడుతూ వచ్చిన జనసేన నాయకులకు కూడా నమ్మకం సడలిపోతుంది. పార్టీ నాయకులు, శ్రేణుల మీద కూడా పట్టు జారిపోవడానికి నిదర్శనమే.. తోట చంద్రశేఖర్, పార్థసారధి జనసేను వీడి బిఆర్ఎస్ లో చేరిపోవడం!

ఫిరాయింపు చిన్నదే కానీ.. 

నిజానికి తోట చంద్రశేఖర్ గానీ, పార్థసారథిగానీ మహానాయకులేమీ కాదు. వారికి పెద్దగా జనాదరణ కూడా లేదు. ఎంపీ కావాలనే కలలతో రకరకాల ప్రయత్నాలుచేసి, పవన్ అధికారంలో భాగస్వామి అయిపోతాడు.. ఆయన కోటరీ నుంచి మంత్రి పదవిని దక్కించుకోవచ్చు అనే అత్యాశతో  2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగి కూడా నెగ్గలేకపోయిన తోట చంద్రశేఖర్.. ఏపీలో అతీగతీ లేని బిఆర్ఎస్ పార్టీకి సారధిగా ఏం ఉద్ధరిస్తారు? అంతో ఇంతో పవన్ జనాదరణ కలిసివస్తేనే చతికిలపడ్డ ఈ నాయకులు.. సొంతంగా సారథులై పార్టీని ఏం నడుపుతారు? ఇదంతా కామెడీగా ఉంటుంది. కాబట్టి ఈ నాయకులు పార్టీ మారడం చాలా చిన్న విషయమే. కానీ ఇక్కడ టాపిక్ అది కాదు. అంత చిన్న నాయకులకు కూడా పవన్ కల్యాణ్ మీద నమ్మకం సడలిపోయిందంటే.. ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు ఉన్నట్టు?

తోట చంద్రశేఖర్ జనసేన పార్టీకి, సినిమా పరిభాషలో చెప్పాలంటే, ఫైనాన్షియర్ వంటి వ్యక్తి. అలా సుదీర్ఘకాలం ఆ పార్టీ మీద పెట్టుబడులు పెట్టారు. పవన్ కల్యాణ్ డప్పు కొట్టడానికి తన సొంత డబ్బుతో టీవీ ఛానెల్ కూడా కొన్నారు. అది లాభాలు సంపాదించడం అసాద్యం అని తెలిసినా నడిపారు. పత్రికలూ గట్రా పెట్టారు. సోషల్ మీడియా సేనలనూ గట్రా నిర్వహించారు. పవన్ మీద అంత నమ్మకంతో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి.. ఎందుకిలా దూరం అయ్యారు. 

జగన్ పతనం చూసేదాకా నిద్రపోను అనే రేంజిలో ప్రతిజ్ఞలు చేస్తున్న సమయంలో.. ఆ మాటల మీద సొంత మనుషులకే నమ్మకం కలగడం లేదనడానికి ఇది నిదర్శనం. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనేది పార్టీకి ఆత్మహత్యా సదృశం అవుతుందని కూడా వీరు భయపడుతుండవచ్చు. బిఆర్ఎస్ ద్వారా గెలిచే నమ్మకం కూడా తక్కువే అయినా సరే.. ముందుగా.. పవన్ కల్యాణ్ నీడనుంచి బయటపడితేచాలు అని వారు వెళ్లిపోయినట్లుగా కనిపిస్తుంది. 

వారాహి యాత్ర ఏమైంది?

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేస్తానని పవన్ కల్యాణ్ చాలా కాలం కిందట ప్రకటించారు. ఆ యాత్ర విజయదశమి నాడు ప్రారంభమవుతుందని కూడా అట్టహాసంగా ప్రకటించారు. మొత్తానికి వారాహి వాహనాన్నయితే సిద్ధం చేసుకున్నారు. దానితో ఫోటో షూట్ దిగి.. కాస్త హడావుడి చేశారు. మిలిటరీ గ్రీన్ చొక్కాలు గట్రా ట్విటర్ లో పెట్టి.. కాస్త వెటకారాన్ని కూడా పండించారు. ఇన్ని చేశారు గానీ.. యాత్ర మాత్రం మొదలు కావడం లేదు. తమ కోసం పవన్ కల్యాణ్.. చెప్పిన రీతిలోనే పనిచేస్తాడని ప్రజలు ఎలా నమ్మగలరు?

వారాహి యాత్ర ఎందుకు మొదలుకావడంలేదో.. ఊర్లలో సామాన్యులు కూడా ఒకటే అనుకుంటున్నారు. ఆ యాత్రకు సంబంధించి.. చంద్రబాబు ఇంకా రూట్ మ్యాప్ పంపలేదని! అవును మరి.. పుత్రుడు లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఆ రూట్ మ్యాప్ ఖరారైన తర్వాత.. ఏయే నియోజకవర్గాలు కవర్ కాకుండా మిగిలిపోతాయో.. ఏయే సెగ్మెంట్లు కీలకంగా కవర్ చేయాలో.. వాటితో కలిపి పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు షెడ్యూలు చంద్రబాబు తయారు చేస్తారని, ఆ తర్వాత పవన్ దానిని మొదలు పెడతారని ప్రజలు అంటున్నారు. కాదు, నా యాత్ర నా ఇష్టం.. అని పవన్ ప్రజలను ఎలా నమ్మించగలరు? 

బిజెపి కూడా తూచ్ అనుకుంటుందా?

పట్టుకోల్పోవడం అంటే నమ్మకం కోల్పోవడమే. సొంత పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజల్లో  నెమ్మది నెమ్మదిగా పట్టు కోల్పోతున్న పవన్ కల్యాణ్.. బిజెపితో సంబంధాలు ఎన్నటికి పుటుక్కుమంటాయో తెలియడం లేదు. చంద్రబాబు భజన చేయడానికి ఒప్పుకోకపోతే.. ఆయనే బిజెపితో తెగతెంపులు చేసుకుంటారా? లేదా, ఇంత నిలకడలేని పవన్ కల్యాణ్ తో జట్టుకట్టి.. రాబట్టగల 2--3 శాతం అదనపు ఓట్ల కంటె.. తమ సొంత బలాన్ని నమ్ముకున్ని ఒక్కశాతం అదనంగా తెచ్చుకున్నా చాలునని బిజెపి విసిగిపోయి నిర్ణయం తీసుకుంటుందా వేచిచూడాలి. ఆ పార్టీ నమ్మకాన్ని కోల్పోతే పవన్ కల్యాణ్ వ్యవహారం సంపూర్ణం అవుతుంది. 

స్థూలంగా చూసినప్పుడు పవన్ కల్యాణ్ ను నమ్ముతున్న ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడు మాత్రమే. సదరు చంద్రబాబు ది అవకాశవాద వైఖరి తప్ప నిజమైన నమ్మకం, విశ్వాసం కాదని ప్రజలందరికీ తెలుసు. పవన్ కు కూడా తెలుసు. కాపు ఓట్ల మీద కన్నేసి పవన్ ను చంద్రబాబు ఆదరిస్తున్నారనేది నిజం. చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ కల్యాణ్ నమ్మడమూ, పవన్ కల్యాణ్ జనాదరణను చంద్రబాబు నమ్మడమూ.. ఇప్పుడు వర్తమాన వ్యవహారం. పరస్పరం గత్యంతరం లేని నాయకులు వీరు. దొందూదొందే గనుక.. ఒకరి మీద ఒకరు ఆధారపడి మనుగడ సాగించాలనుకుంటున్నారు. 

..ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?