అచ్చెన్నకు టార్గెట్.. మరి లోకేష్ సంగతేంటి బాబు!

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ అచ్చెన్నాయుడు తన టాలెంట్ చూపించింది లేదు. ప్రత్యక్షంగా ఏ ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం చేసింది లేదు. పరోక్షంగా ఎక్కడా టీడీపీని గెలిపించనూలేదు. పైపెచ్చు పార్టీ…

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ అచ్చెన్నాయుడు తన టాలెంట్ చూపించింది లేదు. ప్రత్యక్షంగా ఏ ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం చేసింది లేదు. పరోక్షంగా ఎక్కడా టీడీపీని గెలిపించనూలేదు. పైపెచ్చు పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ స్టేట్ మెంట్లు మాత్రం ఇచ్చారు. 

ఎట్టకేలకు అచ్చెన్నకు ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చారు చంద్రబాబు. నెల్లూరు కార్పొరేషన్ గెలిపించుకురావాలన్నారు. దీంతో అచ్చెన్న కొన్నిరోజులుగా నెల్లూరులో మకాం వేశారు. అన్నీ తానై చూసుకుంటున్నారు. స్థానిక నేతలు సోమిరెడ్డి, బీదా రవిచంద్రతో కలసి మంత్రాంగం నడుపుతున్నారు. కానీ నెల్లూరులో అదంత సులభం కాదు.

నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు వైసీపీవే. నగర కార్పొరేషన్ పరిధిలో కూడా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బలంగా ఉన్నారు. 

ఒకరకంగా టీడీపీకి అన్ని వార్డుల్లోనూ పోటీ చేసే బలం, బలగం కూడా లేదు. అయితే స్థానికంగా వైసీపీపై అసంతృప్తి ఉందని, అది తమకు లాభం అని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు.

దీనికితోడు ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఇక్కడ వ్యవహారం నడపడానికి రంగంలోకి దింపారు. ఎలాగూ బద్వేల్ ఉప ఎన్నికలను మిస్ చేసుకున్నాం.. కనీసం నెల్లూరు కార్పొరేషన్ లో అయినా హడావిడి చేయాలనేది టీడీపీ ఆలోచన. దీనికోసం అచ్చెన్నకు టాస్క్ అప్పగించారు చంద్రబాబు.

అచ్చెన్నాయుడికి పెద్ద బాధ్యతే..

అన్నపేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచిన అచ్చెన్నాయుడు.. స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేరు. 

అలాంటి వ్యక్తి, ఇప్పుడు నెల్లూరుకి వచ్చి జనాల్ని ఓట్లు వేయమని అడిగితే అది కుదిరేపనేనా. ఆమాత్రం బాధ్యత సోమిరెడ్డి తీసుకోలేక కాదు.. అక్కడ అంత సీన్ లేదని తెలిసే చంద్రబాబు కూడా అచ్చెన్నను బకరా చేయబోతున్నారు. నెల్లూరు టాస్క్ ఫెయిలైతే.. అచ్చెన్నను మరింత డమ్మీ చేయొచ్చనేది బాబు ఆలోచన.

ఇలాంటి టాస్క్ లు చినబాబుకి లేవా..?

అందరికీ అన్ని బాధ్యతలు అప్పగిస్తారు కానీ, లోకేష్ కు ఎలాంటి బాధ్యతలు ఎందుకు అప్పగించరనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 

కనీసం నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కోసమైనా లోకేష్ ని రంగంలోకి దింపొచ్చు కదా, ఆయన టాలెంట్ ఎంతో అంచనా వేయడానికి ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు కదా అనేది టీడీపీ స్థానిక నాయకులు, అభ్యర్థుల వాదన. పైపెచ్చు లోకేష్ ఏమీ బిజీగా లేరు కదా, కనీసం కుప్పం ప్రచారానికి కూడా వెళ్లడం లేదాయె.

లోకేష్ కి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన పనితనం ఏంటో బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు కవర్ చేసుకుంటూ వస్తున్నారు.

2024లో మంగళగిరిలో గెలిచి అధ్యక్షుడికి కానుక ఇస్తానంటున్న లోకేష్.. అంతకంటే ముందే ఏదో ఒక కార్పొరేషన్ ని, లేదా తన స్థాయికి తగ్గట్టుగా ఓ మున్సిపాల్టీలో పార్టీని గెలిపించి సత్తా చూపించొచ్చు కదా అని సెటైర్లు పడుతున్నాయి.