మిత్ర పక్షమైన జనసేనాని వైఖరిపై ఏపీ బీజేపీ గుర్రుగా ఉంది. తాజాగా చంద్రబాబుతో పవన్ భేటీపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీళ్లద్దరి భేటీపై మొట్టమొదటిగా విష్ణు రియాక్ట్ అయ్యారు. ఓ చానల్ డిబేట్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో విశాఖలో పవన్‌కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు వెళ్లి సంఘీభావం తెలిపారన్నారు.
ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబును పోలీసులు అడ్డగించడంతో కృతజ్ఞతగా పవన్ వెళ్లి కలిసి వుంటారని విష్ణు అన్నారు. అంతే తప్ప వీళ్ల భేటీకి పెద్దగా ప్రాధాన్యం వుండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే బాబుతో పవన్‌కల్యాణ్ భేటీ సాగుతుండగా… వైసీపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు సుమారు 20 మంది మీడియా ముందుకొచ్చి పవన్‌పై దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు. పవన్‌కల్యాణ్‌పై ప్రత్యర్థులు సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో సాగిస్తున్న ప్రచారంతో తప్పకుండా జనసేనానికి నష్టం కలుగుతుందన్నారు.
పవన్‌కల్యాణ్ లాంటి బలమైన నాయకుల్ని ఈ భేటీ బలహీనపరుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. జనసేనతోనే తాము కలిసి వెళుతున్నట్టు మరోసారి ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తు, సీట్లపై మాట్లాడుకున్నారని మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గతంలో చంద్రబాబు పాలనను తిరస్కరించి ప్రజలు జగన్‌కు పట్టం కట్టారన్నారు. జగన్ పాలనపై ప్రజావ్యతిరేకత వుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలను ప్రజలు ఎన్నుకోరని, బీజేపీ-జనసేనకు అవకాశం ఇస్తారన్నారు. అలాగే తమలో ఒకర్ని సీఎంగా చూడాలని కాపులు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
బీజేపీతో జనసేన పొత్తులో ఉంటే పవన్‌కు ముఖ్యమంత్రి అవకాశం వస్తుందన్నారు. టీడీపీతో వెళితే ఆ అవకాశం వుండదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు రెడ్లు, అలాగే కమ్మ సామాజిక వర్గం నేతలు పాలించడాన్ని విష్ణు చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తులో వుంటే కాపుల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్టు టీడీపీతో జనసేనాని పొత్తు పెట్టుకుంటే… పవన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందన్నారు. పవన్‌కు నష్టం కలిగించేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని విష్ణు తేల్చి చెప్పారు.