విశాఖపట్నంలో నాలుగు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాయన్న అభియోగాల మీద రెవిన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి పద్నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. గీతం వైద్య కళాశాల మైదాన ప్రాంతాన్ని సైతం రెవిన్యూ అధికారులు ముళ్ళ కంచెలు పెట్టి మరీ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.
ఇదంతా ప్రభుత్వ భూమి అని అందుకే స్వాధీనం చేసుకున్నామని భీమిలీ ఆర్డీవో భాస్కరరెడ్డి తెలిపారు. అలాగే రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37, 38లోని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని, గతంలోనే ఈ స్థలాన్ని గుర్తించామని ఆయన వివరించారు. అందువల్ల 5.25 ఎకరాల్లో కంచె వేశామని తెలిపారు. ఆక్రమిత స్థలాలుగా గుర్తించి దాదాపుగా పది చోట్ల ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డులు పెట్టామని చెప్పారు.
గీతం సంస్థకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంతో పాటుగా ప్రభుత్వ భూములను మరింతగా కలుపుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి వందల కోట్ల విలువ చేసేవి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆరోపణలు తప్ప యాక్షన్ కి ఏ ప్రభుత్వం దిగిన దాఖలాలు లేవు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో ఆక్రమిత భూముల మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కొంత కాలం క్రితం గీతం ప్రధాన ద్వారం ఉన్న ప్రాంతంలో ఆక్రమణలు జరిగాయని గుర్తించి కూల్చేశారు. అది అప్పట్లో రచ్చగా మారింది. ఇపుడు ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా పోలీసులను భారీ ఎత్తున మోహరించి అతి విశాలమైన మైదాన ప్రాంతాన్ని అధికారులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇది పక్కాగా ప్రభుత్వ భూమి అని వారు అంటున్నారు.
అయితే ఇదంతా ప్రభుత్వం రాజకీయ దురుద్దేంతోనే చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా రెండు సార్లు విశాఖకు పనిచేశారు. ఆయన 2018లో దివంగతుడు కావడంతో గీతం మేనేజ్మెంట్ అంతా ఆయన మనవడు భరత్ చేతిలోకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు బాలక్రిష్ణ చిన్నల్లుడు. అంతే కాదు 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి తెలుగుదేశం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇపుడు గీతం స్థలాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష అంటున్నారు.
అయితే దీని మీద వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకున్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని అంటున్నారు. మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే విశాఖలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి తెచ్చి ప్రభుత్వానికి స్వాధీనం చేశామని చెప్పారు. అయితే గీతం సంస్థ తెలుగుదేశం నాయకుడిది కావడంతో రాజకీయ రచ్చ సాగుతోంది.