బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి సంబంధించిన కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మరీ ముఖ్యంగా రియా ఎప్పుడైతే విచారణలోకి వచ్చిందో అప్పట్నుంచి కొత్త విషయాలకు కొదవలేకుండా పోయింది. ఈ క్రమంలో ఈరోజు ఈ కేసుకు సంబంధించి మరో కొత్త కోణం బయటపడింది. అదే డ్రగ్స్ కోణం.
అవును.. రియా చక్రబొర్తి వాట్సాప్ ఛాట్ ను నిశితంగా పరిశీలించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు.. అందులో డ్రగ్స్ వాడకం, సరఫరాకు సంబంధించిన ఛాటింగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఉత్తరాదికి చెందిన ఓ న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ.. గడిచిన రెండేళ్లుగా రియా జరిపిన ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఆమె వాట్సాప్ ఛాటింగ్స్ పరిశీలించిన అధికారులు.. కొత్తగా డ్రగ్స్ కోణం కూడా ఉన్నట్టు తెలుసుకున్నారని సదరు వార్తా ఛానెల్ కథనం ఇచ్చింది.
మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే రియాను, ఆమె సోదరుడ్ని విచారించిన ఈడీ.. సుశాంత్ తండ్రి కేకే సింగ్, సిస్టర్స్ ప్రియాంక, మీటూ.. ఫిలిం మేకర్స్ రూమీ జెఫ్రీ, సిద్దార్థ్ పితానీ, శృతిమోడీ, శామ్యూల్ మిరందా వాంగ్మూలాలు రికార్డ్ చేశారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ అధికారులు తమదైన శైలిలో ఓవైపు నుంచి విచారణ జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ కోణం వివరాల్ని త్వరలోనే సీబీఐకి అందిస్తామంటోంది ఈడీ.