టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్‌నాయుడు భలే చిలిపి. ఆయనలో తాతకు, తండ్రికి మించిన నటనా లక్షణాలున్నాయి. అలాగే జంధ్యాలకు మించిన హాస్య రచయిత లోకేశ్‌లో ఉన్నారు. లోకేశ్ ట్వీట్లను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. హాస్యం పండించడం అన్నిటికంటే కష్టమైన పని. ఎందుకంటే హాస్యం పండించే క్రమంలో అపహాస్యం కాకుండా చూసుకోవాలి. మన లోకేశ్నాయుడికి అలాంటి పట్టింపులేవీ ఉండవు.
ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్థ్’ కామెడీ షో ఎంత పాపులరో అందరికీ తెలుసు. ఆ షోపై ఎన్ని విమర్శలొచ్చినా, రేటింగ్‌లో అది టాప్. ‘జబర్దస్థ్’ టీంకు మంచి స్క్రిప్ట్ రైటర్ లోకేశ్ రూపంలో దొరికారు. లోకేశ్ స్ర్కిప్ట్ ముందు…హైపర్ ఆది, షకలక శంకర్‌లాంటి వాళ్లంతా ఎందుకూ పనికి రారంటే అతిశయోక్తి కాదు. అయినా కామెడీ షోలకు స్ర్కిప్ట్ రాసుకుంటూ లేదా అందులో నటిస్తూ అనవసరంగా ఇష్టంలేని రాజకీయ రంగంలో లోకేశ్ కొనసాగుతున్నారనే అనుమానం కలుగుతోంది.
రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు ‘దిశ’ తరహాలో చట్ట సవరణ చేస్తామన్న జగన్ సర్కార్ తీరుపై లోకేష్ వ్యంగ్యస్త్రాలు సంధిం చారు. తాజాగా లోకేశ్ ట్వీట్ చూడండి…అచ్చం జబర్దస్థ్ డైలాగ్స్‌ను తలపించేలా ఉన్నాయి.
‘జగన్ రెడ్డి గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు. అవినీతి చక్రవర్తి, క్విడ్‌ప్రోకో కింగ్, ప్రజల సొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచల్‌గూడలో 16 నెలల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబర్ 6093. ఇదే నెంబర్ అవినీతిపై ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది! మీరు దోచేసిన ప్రజా సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమ చేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డి గారు ఒక సారి ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యానించారు.
విభజిత రాష్ట్రాన్ని పాలనానుభవంతో గట్టెక్కిస్తారని ఏపీ ప్రజలు 2014లో అధికారం ఇస్తే…లక్షల కోట్లు దోపిడీకి పాల్పడిన విషయాన్ని లోకేశ్ చాలా సౌకర్యంగా మరిచినట్టున్నారు. 2019 ఏపీ ప్రజాకోర్టు తీర్పుతో 23 సీట్లకే పరిమితమై…మూలన కూచోపెట్టినా లోకేశ్‌కు ఇంకా జ్ఞానోదయం కానట్టుంది. లోకేశ్ చెప్పినట్టు 6093 నంబర్ సంగతేమోగానీ, 23ని టోల్‌ఫ్రీ నెంబర్‌గా ఇస్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది. వెటకారాలు మాని సీరియస్‌గా రాజకీయాలు చేస్తే…భవిష్యత్‌లోనైనా ప్రజలు కరుణించే అవకాశం ఉంటుంది. లోకేశ్ తీరులో మార్పు రాకపోతే…జబర్దస్థ్ టీం నుంచి పిలుపు రావడం ఖాయం.