ఒకే బీజేపీ…రెండు ముఖాలు

బీజేపీకి ఒక‌ప్పుడు నిబ‌ద్ధ‌త వుండేది. ఎంపీల‌తో భేరాలు చేయ‌కుండా ఒక ఓటుతో ప్ర‌భుత్వాన్ని వ‌దులుకునే వాజ్‌పేయ్ కాలం కాదు. ఎలాగైనా అధికారంలో వుండాల‌నుకునే మోదీ -అమిత్‌షా పాల‌న ఇది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ర‌కంగా…

బీజేపీకి ఒక‌ప్పుడు నిబ‌ద్ధ‌త వుండేది. ఎంపీల‌తో భేరాలు చేయ‌కుండా ఒక ఓటుతో ప్ర‌భుత్వాన్ని వ‌దులుకునే వాజ్‌పేయ్ కాలం కాదు. ఎలాగైనా అధికారంలో వుండాల‌నుకునే మోదీ -అమిత్‌షా పాల‌న ఇది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ర‌కంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎమ్మెల్యేల‌ను కొన‌డం త‌మ ప‌ద్ధ‌తి కాద‌ని అంటారు. అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల‌ను కొని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ కార్పొరేష‌న్‌లో ఆప్‌కి మెజార్టీ వుందని తెలిసి కూడా, ఆ సీటు కొట్టేయాల‌ని గేమ్ ఆడుతున్నారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌లో ఏం జ‌రిగిందో తెలుసు. రేపు తేడా వ‌స్తే తెలంగాణ‌లో కూడా ఇదే గేమ్‌.

స‌రే, అధికారం కోసం ఎత్తుగ‌డ‌లు వేస్తే అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కూడా రెండు ముఖాల‌తో వుంది. ఉత్త‌రాఖండ్‌లోని హ‌ల్వానిలో 50 వేల మందిని ఖాళీ చేయించాల‌ని హైకోర్టు తీర్పు ఇస్తే, సుప్రీంకోర్టు దాన్ని ఆపేసింది. అక్క‌డున్న వాళ్లు పేద‌లు, ఎక్కువ‌గా ముస్లింలు. వాళ్లు త‌మ ఓటు బ్యాంక్ కాదు కాబ‌ట్టి బీజేపీకి అవ‌స‌రం లేదు. హ‌ల్వానిలో ద‌శాబ్దాలుగా పేద‌లున్న 29 ఎక‌రాల స్థ‌లం, త‌మ‌దే అని రైల్వేశాఖ కోర్టుకు వెళ్లింది. అక్క‌డ 4 వేల ఇళ్లు, ప్రార్థ‌నా మందిరాల‌తో పాటు, ప్ర‌భుత్వ‌మే క‌ట్టిన స్కూల్, ఆస్ప‌త్రులు కూడా ఉన్నాయి. ఆరేళ్ల క్రితం ఆ స్థ‌లం పేద‌ల‌కే చెందాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావించింది. అయితే బీజేపీ వ‌చ్చి ప్ర‌జ‌ల‌కి వ్య‌తిరేక‌మైన నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌లోని కామారెడ్డి విష‌యంలో మాత్రం బీజేపీకి రైతులు, మాన‌వ హ‌క్కులు గుర్తొస్తాయి. నిజానికి అక్క‌డ వెంట‌నే జ‌రుగుతున్న న‌ష్టం కూడా ఏమీ లేదు. మాస్ట‌ర్ ప్లాన్‌లో త‌మ భూములు లాక్కుంటార‌ని రైతుల భ‌యం. వాళ్ల‌కు స‌మాధానం చెప్పాల్సిన క‌లెక్ట‌ర్ స‌రిగా స్పందించ‌లేదు. ప్ర‌జ‌ల‌కి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని కేటీఆర్ అన్నాడు కానీ, అప్ప‌టికే బీజేపీ రంగ ప్ర‌వేశం చేసింది. ప‌రిస్థితి అనుకూలంగా మార్చుకోడానికి కీల‌క నాయ‌కులు వ‌చ్చి ధ‌ర్నా, బంద్ జ‌రిపించారు. నిజంగా రైతుల‌కి అన్యాయం జ‌రిగితే ముందుండి పోరాడాల్సిందే. ప్ర‌తిపాద‌న ద‌శ‌లోనే మంట రాజేశారు.

అక్క‌డేమో పేద‌వాళ్ల ఇళ్లు కూల్చ‌డానికి రంగం సిద్ధ‌మైతే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టున్నారు. ఈ ఏడాది తెలంగాణ‌లో బీజేపీ వైఖ‌రి దూకుడుగా వుంటుంది. ఇల్లు స‌ర్దుకోకుండా కేసీఆర్ దేశ‌మంతా తిరిగి బీఆర్ఎస్‌ని ప్ర‌చారం చేస్తాడ‌ట‌!ఆంధ్రా బీఆర్ఎస్ నాయ‌కులు విప‌రీత‌మైన బిజీ అయిపోతార‌ట‌!మొన్న మీటింగ్‌లో కేసీఆర్ చెప్పాడు. హైద‌రాబాద్ మీటింగ్ త‌ర్వాత ఆంధ్రా బీఆర్ఎస్ నాయ‌కుల శ‌బ్దం కూడా విన‌ప‌డలేదు. బ‌హుశా బిజీ అంటే ఇదేనేమో!

తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ ఎంత కామెడీనో, ఆంధ్రాలో బీఆర్ఎస్ కూడా అంతే కామెడీ.