జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ పవన్‌కల్యాణ్ భేటీ అయిన వెంటనే… మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా మొదట సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించిన తర్వాత… అంబటి మీడియా ముందుకొచ్చారు. పవన్ రాజకీయ పంథాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి… చంద్రబాబు ఇంటికి పవన్‌కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ” అని మొదట అంబటి ట్వీట్‌తో చెలరేగిపోయారు. పవన్‌ను డుడు బసవన్నతో పోల్చి వెటకరించారు. ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో చిరంజీవి విలీనం చేయడాన్ని గుర్తు చేశారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నట్టుగానే, టీడీపీలో జనసేనను విలీనం చేస్తే…చంద్రబాబు పవన్‌కు ఏదో ఒక పదవి ఇస్తారని అంబటి చెప్పుకొచ్చారు.
టీడీపీ, జనసేన రెండూ వేర్వేరు పార్టీలు కాదని మంత్రి అంబటి అన్నారు. టీడీపీని కాపాడేందుకే జనసేన పుట్టిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ భేటీలో ప్రజాస్వామ్యం గురించి చర్చించలేదన్నారు. కేవలం టీడీపీ పరిరక్షణ గురించి మాత్రమే వాళ్లు చర్చించుకున్నారని ఆరోపించారు.
టీడీపీ, జనసేన కలిసే ఎన్నికలకు వస్తాయని తాము ఎప్పుడో చెప్పామని అంబటి గుర్తు చేశారు. పవన్, బాబు ప్రతిరోజూ రాత్రి మాట్లాడుకుంటూనే వున్నారన్నారు. ఈ ఇద్దరి మధ్య నాదెండ్ల మనోహర్ బ్రోకరిజం చేశారని సంచలన ఆరోపణ చేయడం గమనార్హం.