వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయ ఎజెండాను ఆమెతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎల్లో మీడియా ఏవేవో రాస్తోంది, కూస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని షర్మిల కలుసుకుని, తన భవిష్యత్‌పై చర్చించారు. తెలంగాణతోనే తన రాజకీయ బతుకు ముడిపడి వుందని ఆమె తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని తేల్చి చెప్పారు.
దీంతో తెలంగాణలోనే మలి విడత రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని తేలిపోయింది. తెలంగాణలో షర్మిల పని చేయాలని అనుకున్నా, కాంగ్రెస్‌కు లేని అభ్యంతరం ఎల్లో మీడియాలో కనిపిస్తోంది. తెలంగాణలో షర్మిల రాజకీయాన్ని తాము ఒప్పుకునేది లేదన్నట్టు ఎల్లో మీడియా కథనాలు వండివార్చుతోంది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్‌లో తన అన్నకు వ్యతిరేకంగా పని చేస్తే చూడాలని ఎల్లో మీడియా తహతహలాడుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తుంటే తనివి తీరా వినాలని, చూడాలని ఎల్లో బ్యాచ్ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తన తండ్రి వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని షర్మిల ఇవాళ ఇడుపులపాయకు చేరుకున్నారు. శనివారం తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం వుందనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయ ప్రస్థానంపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.
కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తే ఏపీ కేంద్రంగా షర్మిల తన మార్కు రాజకీయంతో చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదంటూ ఎల్లో మీడియా తనదైన రాతలతో ఆనందిస్తోంది. అయితే షర్మిల ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం, తానెక్కడ పని చేస్తాననే విషయాలపై ఆమె నోరు జారడం లేదు. దీంతో ఎల్లో మీడియా తీవ్ర అసహనంతో ఉంది. కనీసం శనివారం అయినా తాము కోరుకుంటున్నట్టుగా ఏపీలో కూడా పని చేస్తానని ఆమె నుంచి ప్రకటన వస్తుందేమో చూడాలి.