రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన ఓ 'ముద్దు ఘటన' చిన్నపాటి వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి, హీరోయిన్ మన్నారాను ముద్దాడాడు. ఆమె భుజాలపై ఆప్యాయంగా చేయి వేసి, బుగ్గపై గట్టిగా ఓ ముద్దు పెట్టాడు. ఊహించని ఘటనతో మన్నారా షాక్ అయింది. అయితే ఆ వెంటనే తేరుకొని నవ్వేసింది.
మీడియా ముందే దర్శకుడు చేసిన ఈ పనిపై విమర్శలు చెలరేగాయి. ఆ వెంటనే దర్శకుడు తన చేసిన పనిపై స్పందించాడు కూడా. మన్నారాను ముద్దుపెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. ఆప్యాయతతో అలా చేశానని, తన కూతుర్ని కూడా అలానే ముద్దు పెట్టుకుంటానని అన్నాడు. అయినా సదరు హీరోయిన్ కు లేని ప్రాబ్లమ్ మీడియాకు ఎందుకంటూ కాస్త గట్టిగా మాట్లాడాడు.
ఇప్పుడీ వ్యవహారంపై ఎట్టకేలకు మన్నారా కూడా స్పందించింది. డైరక్టర్ చేసిన పనిని సమర్థించింది మన్నారా. ఆయన తప్పుడు ఆలోచనతో అలా చేయలేదని తెలిపింది. మొదట్నుంచి ఏఎస్ రవికుమార్, మన్నారా చోప్రాను బేటీ..బేటీ అని సంబోధిస్తున్నారట. అదే ఆప్యాయతతో ఆరోజు అలా బుగ్గపై ముద్దుపెట్టి ఉంటారని అభిప్రాయపడింది మన్నారా.
డైరక్టర్ పెట్టిన ముద్దులో తనకు తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది. అలా మీడియా మందు ముద్దుపెట్టేసరికి కాస్త కంగారు పడ్డానే తప్ప, ఆయన ముద్దులో తనకు పెడార్థాలు కనిపించలేదని అంటోంది. ఆ తర్వాత తన రియాక్షన్ చూస్తే అందరికీ విషయం అర్థమై ఉంటుందని, ఆ ఘటనలో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది ఈ బ్యూటీ.