మార్వాడీ మార్వాడీ కొట్టుకుంటే పాత బంగారం రేటు బయటపడిందని.. ఒక సినిమాలో కమేడియన్ ఒక సామెత చెబుతాడు. మార్వాడీ వ్యాపారులకు మించిన మాయగాళ్లు టీవీ చానళ్ల అధిపతులు అని వేరే చెప్పనక్కర్లేదు. తెలుగు నాట టీవీ చానళ్ల అధిపతుల దందాలకు ఒక హద్దూ అదుపు లేకుండా పోయిందని ఇది వరకటి బోలెడన్ని ఉదంతాలు నిరూపించాయి. కాస్త జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ తో టీవీ చానళ్ల అధిపతులు అయిపోయి.. రాష్ట్ర రాజకీయాలను తామే శాసించాలని ఫీలయ్యే వాళ్లు, అక్రమ దందాలను చేస్తున్న వాళ్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు కూడా!
ఒక టీవీ చానల్ సీఈవోగా వ్యవహరించి.. తనను తాను ఎక్కువగా ఊహించేసుకుని ప్రస్తుతం ఆచూకీ చిక్కని రవి ప్రకాష్ తో సహా ఇలాంటి వారు చాలా మంది. కామెడీ ఏమిటంటే.. ప్రైవేట్ దందాల విషయంలో చానళ్ల మధ్యనే తీవ్ర పోటీ ఏర్పడింది. ఎవరికి వారు తామే దందాలు చేయాలని, తమకే దక్కాలని పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు చానళ్ల మధ్యన కూడా రచ్చ వీధికెక్కుతూ ఉంటుంది!
ఈ క్రమంలో ఇటీవలే రెండు తెలుగు 24 గంటల వార్తా చానళ్లు రచ్చ చేసుకున్నాయి. వీటి మధ్య వైరం ఇప్పటిది కాదు. అప్పుడెప్పుడో ఆరంభంలోనే వీళ్లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఒక చానల్ పేరు విషయంలో వివాదం రేపింది మరో చానల్. ఆస్ట్రేలియాలో ఇదే పేరుతో ఒక చానల్ ఉంది. అదో పెద్ద చానల్. ఆ పేరులో నంబర్ ఉంటుంది. ఆ పేరును యథారీతిన వాడుకుంటూ చానల్ స్టార్ట్ అయినప్పుడు, ఆస్ట్రేలియన్ టీవీ యాజమాన్యానికి మరో చానల్ వారు ఫిర్యాదు చేశారట. చివరకు ఆ వివాదం ఎలాగో పరిష్కారం అయ్యింది, ఆ ఐదో నంబర్ చానల్ తెలుగులో కొనసాగుతూ ఉంది.
ఇక ఈ చానళ్ల మధ్య తాజా వివాదం వెనుక ఒక ఆసక్తిదాయకమైన కథ ఉందట. ఈ విషయాన్ని ఒక స్కూల్ వాళ్లు వివరిస్తూ ఉండటం గమనార్హం! ఇంతకీ ఈ టీవీ చానళ్ల మధ్యన ఆ స్కూల్ ఎందుకు తలదూర్చిందంటే.. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఏరియాకు పెద్దమనిషిగా ఉన్నారు ఒక టీవీ చానల్ అధిపతి. సామాజికంగా ఆయనకు లభించిన హోదాలో ఆ ఏరియా అంతా కలిసి ప్రైవేట్ గా ఏర్పాటు చేసుకున్న సంఘానికి అధ్యక్షుడుగా ఉంటున్నారట ఆయన. పదేళ్లుగా ఆయన ఆ హోదాలో ఉన్నారట.
ఆ ప్రాంతంలో ఒక పేరెన్నిక గల ఒక పెద్ద స్కూల్ ఉంది. ప్రముఖుల పిల్లలు చదివే స్కూల్ అది. తనకు స్థానికంగా లభించిన పెద్దరికంతో ఆ స్కూల్ డైరెక్టర్ గా తన కూతురును నియమించుకోవాలని ఆ టీవీ చానల్ యజమానికి అనిపించిందట. అంతే తడవుగా ఆ స్కూల్ యాజమాన్యం మీద ఈ మేరకు ఒత్తిడి తీసుకొచ్చారట. అయితే ఆయన కూతురును డైరెక్టర్లలో ఒకరిగా నియమించడం ఇష్టం లేక ఆ స్కూల్ అందుకు నో చెప్పిందట.
ఆ స్కూల్ వాళ్లకూ బొక్కలున్నాయట. తమ స్కూల్ కు అనుకుని ఉన్న కొంత పబ్లిక్ స్థలాన్ని పార్కింగ్ కోసం వారు వాడుతున్నారట. ఆ కాస్ట్లీ ఏరియాలో ఆ మాత్రం స్థలాన్ని ఉచితంగా వాడుకోవడం కూడా పెద్ద విషయమే. ఆ వీక్ పాయింట్ ను ఆసరాగా చేసుకుని ఆ స్కూల్ ను ఇబ్బంది పెట్టారట ఆ వార్తా చానల్ అధిపతి.
దీంతో ఆ స్కూల్ వాళ్లు మరో టీవీ చానల్ ను సంప్రదించి మొత్తం విషయాన్ని మొరపెట్టుకున్నారట. ఇలాంటి పంచాయతీల కోసం ఎదురుచూసే మరో చానల్ కూడా ఈ ఉదంతంలోకి లేటు చేయకుండా దూకింది. సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలినట్టుగా.. వీళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేంత వరకూ వెళ్లారు.
అయితే ఇంతలో కులపెద్ద రంగ ప్రవేశం చేశారట. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మీరూ మీరూ కొట్టుకుంటే పోయేది ఎవరి పరువు? 'రాజీ కండి..' అని ఆ సామాజికవర్గపు పెద్ద ఇరు వర్గాలకూ సర్ధిచెప్పారట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన కుల వ్యవహారాలను చక్కబెట్టడంలో, కులాన్ని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారనే సంగతి అందరికీ ఎరుకే. ఇలా ఆయన జోక్యంతో కథ సుఖాంతం అయ్యిందని భోగట్టా. వారూ వారూ రాజీ కావడంతో.. ఇప్పుడు దిక్కుతోచని ఆ స్కూల్ వర్గాలు ఇప్పుడు అసలు కథను ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నాయి!