అంత దమ్ముందా రఘురామా..? ఈటలను చూసి నేర్చుకో

ప్రెస్ మీట్లు పెట్టి శ్రీరంగ నీతులు వల్లించే ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పుడు రివర్స్ లో నెటిజన్లు పాఠాలు చెబుతున్నారు, క్లాస్ పీకుతున్నారు.  Advertisement ఈటలకు ఉన్నంత ధైర్యం కూడా రఘురామకు లేదని ఎద్దేవా…

ప్రెస్ మీట్లు పెట్టి శ్రీరంగ నీతులు వల్లించే ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పుడు రివర్స్ లో నెటిజన్లు పాఠాలు చెబుతున్నారు, క్లాస్ పీకుతున్నారు. 

ఈటలకు ఉన్నంత ధైర్యం కూడా రఘురామకు లేదని ఎద్దేవా చేస్తున్నారు. వట్టి మాటలు కట్టి పెట్టి, కదనరంగంలోకి దూకాలంటూ సలహా ఇస్తున్నారు. 

స్వపక్షంలో విపక్షంలా ఉంటూ ఎంతకాలం తిడుతూ తిట్టించుకుంటూ ఉంటారు, బయటికొచ్చి ధైర్యంగా తిరుగుబాటు జెండా ఎగరేయాలని సూచిస్తున్నారు.

ఈటల ఏం చేశారు..?

పార్టీ అధినేత కేసీఆర్ కి, ఈటలకు వ్యవహారం చెడింది. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈటల వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. తనని బహిష్కరించడం కాదు, తానే టీఆర్ఎస్ ని బహిష్కరించానంటూ ధైర్యంగా బయటికొచ్చారు. 

కేసులున్నా కూడా ఒంటరిగా పోరాడారు. కేసీఆర్ ని ఢీకొనడానికి తన స్టామినా సరిపోదని అనుకున్నారేమో.. అధికారికంగా బీజేపీలో చేరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లారు. మొనగాడిలా గెలిచారు. ఇప్పుడు ఈటల ఏం మాట్లాడినా చెల్లుతుంది.

రఘురామ ఏం చేస్తున్నారు.. ?

పార్టీలోనే ఉంటారు.. పార్టీని విమర్శిస్తారు. సొంత పార్టీ నేతలు ఛీకొట్టినా రాజీనామా చేయరు. అన్నీ తొండి ఆటలు. వెన్నుపోట్లు, దొంగదారులు. వెబ్ సైట్లో తన పేరు తొలగించారని అంటారే కానీ, తనని లిస్ట్ లో నుంచి వైసీపీ ఎప్పుడో బయటపడేసిందనే విషయాన్ని మాత్రం ఒప్పుకోరు. 

ఈటల లాగా నేరుగా బీజేపీతో చేతులు కలపలేరు. దొడ్డిదారిన జాతీయ పార్టీతో కలిసిపోయారు. పనిలో పనిగా టీడీపీ చేతిలో పావుగా మారిపోయారు. ఓ వర్గం మీడియా సపోర్ట్ తో రెచ్చిపోతున్నారు. రఘురామ చేతల మనిషి కాదు, కేవలం మాటల మనిషి మాత్రమే అని పదే పదే నిరూపించుకుంటున్నారు.

రఘురామ ఏం చేయాలి..?

పార్టీ గెంటేసినా ఆ చూరు పట్టుకుని వేలాడకూడదు. నిఖార్సుగా బయటికొచ్చేయాలి, వేరు కుంపటి పెట్టేంత సత్తా ఉంటే పార్టీ పెట్టుకోవాలి. లేకపోతే ఇన్నాళ్లూ లోపాయికారీగా కలిపిన చేతుల్ని ఇప్పుడు బహిరంగ పరచాలి. 

అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే టీడీపీ కండువా కప్పేసుకుని పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. నిజంగా దమ్ముంటే, ఆయన కమ్యూనిటీకి ఓ విలువ ఉందని నిజంగా భావిస్తే ఈటల టైపులో రఘురామ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. వైసీపీ అభ్యర్థిని ఓడించి అప్పుడు మాట్లాడాలని సవాల్ విసురుతున్నారు.

అంత దమ్మే ఉంటే ఇంత దాకా ఎందుకు?

జగన్ తనను పిలిచి సీటిచ్చారని.. తను జగన్ వేవ్ లో గెలవలేదని, తన సొంత కరిష్మాతో గెలిచానని పదే పదే డప్పు కొట్టుకుంటుంటారు రఘురామ. 

నిజంగా అంత నమ్మకమే ఉంటే ఆయన ఎప్పుడో ఎంపీ పదవికి రాజీనామా చేసి, వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేవారు. కానీ రఘురామకు అంత దమ్ము లేదు. ఈటలకున్న పౌరుషం కూడా లేదు. 

పేరులో ఉన్న రాజరికం.. రఘురామలో ఏ కోశానా లేదని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నా వాటిని ఆస్వాదించడం మినహా ఆయన చేయగలిగిందేమీ లేదు.