అభిమానులే దర్శకులిగా మారి సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది? అలా ఇద్దరు అభిమానులు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో పోడీపడితే ఎలా ఉంటుంది? ఈ సంక్రాంతికి ఆ వెరైటీ పోరును మనం చూడబోతున్నాం.
చిరంజీవి వీరాభిమాని బాబి, బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్ గోపీచంద్ మలినేని ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారు. తమ అభిమాన హీరోల్ని వెండితెరపై ఊరమాస్ గా ప్రజెంట్ చేస్తూనే, తమ సత్తాతో బాక్సాఫీస్ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు.
చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానమో బాబి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చిరు సినిమా చూసేందుకు పోలీసు దెబ్బలు తిన్నానని చెప్పుకున్నాడు. అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడు రోజూ చిరంజీవి ఫొటోను క్లీన్ చేసే వాడినని అన్నాడు. చిరంజీవిని తొలిసారి కలిసిన సందర్భం తన లైఫ్ టైమ్ మెమొరీ అన్నాడు.
ఇలాంటి కరడుగట్టిన అభిమాని, చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్యలో తన కలల చిరంజీవిని ఆవిష్కరించాడు. తన సినిమాతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తానంటున్నాడు.
ఇక మరో డైహార్డ్ ఫ్యాన్ కూడా వస్తున్నాడు. అతడే గోపీచంద్ మలినేని. బాలకృష్ణకు తను బై బర్త్ ఫ్యాన్ అంటున్నాడు మలినేని. సమరసింహారెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి వెళ్లి లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలులో కూడా ఉన్నాడు. బాలయ్య సినిమాను మొదటి రోజు చూడందే ఈ దర్శకుడు నిద్రపోడు.
ఇలాంటి వీరాభిమాని, బాలయ్యను డైరక్ట్ చేశాడు. చిన్నప్పట్నుంచి బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నాడో, వీరసింహారెడ్డిలో అలా చూపించానంటున్నాడు. బాలయ్య ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీశానంటున్నాడు. కుంభస్థలం కొడతానంటున్నాడు.
ఇలా ఇద్దరు వీరాభిమానులు దర్శకులుగా సంక్రాంతి బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమతమ హీరోలపై ఉన్న ప్రేమను వీళ్లు బాక్సాఫీస్ విజయంగా మార్చుకోగలరా? వెయిట్ అండ్ సీ..!