నవమాసాలు మోసి, జన్మనిచ్చిన బిడ్డను ఏ తల్లయినా చంపుకుంటుందా? ఈ తల్లి మాత్రం తన బిడ్డను తన చేతులతోనే చంపేసింది. ఇదే దారుణమైన విషయం అనుకుంటే, అసలు ఆ తల్లి ఎందుకా బిడ్డను చంపుకుందనే కారణం మరింత దారుణం.
మహారాష్ట్రలోని లాతూరు సమీపంలో ఉన్న ఉస్మానామాద్ లో పాతికేళ్ల యువతి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన 3 రోజులకే ఆ బిడ్డ చనిపోయింది. అనుమానంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ చేపట్టగా కన్నతల్లే, బిడ్డను హత్య చేసినట్టు రుజువైంది. తన చేతి రుమాలుతో బిడ్డ గొంతు నులిమి చంపేసింది ఆ కర్కశ తల్లి.
ఇంతకీ ఆ తల్లి ఎందుకా బిడ్డను హత్య చేసిందో తెలుసా? పుట్టింది ఆడ బిడ్డ కాబట్టి హత్య చేసిందట. ఆమెకు ఇదివరకే ఆడ పిల్ల ఉంది. రెండో సంతానంలో కూడా ఆడ బిడ్డ జన్మించడంతో, ఆ పసికందును హత్య చేసింది ఈ మహాతల్లి.
జరిగిన ఘటనపై గోటెగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని అరెస్ట్ చేశారు. నిందిత యువతి మానసిక స్థితిపై కూడా ఆరా తీస్తున్నారు.