సీనియర్ హీరోల మందు ముచ్చట్లు

సాయంత్రమైతే ఓ పెగ్గు వేసుకోవడం ఇండస్ట్రీలో చాలామందికి అలవాటు. కానీ కొంతమంది మాత్రమే ఆ విషయాల్ని బయటపెడతారు. మరికొంతమందికి అది పూర్తిగా వ్యక్తిగత విషయం. బాలకృష్ణ బ్రాండ్ అంటే అందరికీ తెలిసిందే. అలాగే మోహన్…

సాయంత్రమైతే ఓ పెగ్గు వేసుకోవడం ఇండస్ట్రీలో చాలామందికి అలవాటు. కానీ కొంతమంది మాత్రమే ఆ విషయాల్ని బయటపెడతారు. మరికొంతమందికి అది పూర్తిగా వ్యక్తిగత విషయం. బాలకృష్ణ బ్రాండ్ అంటే అందరికీ తెలిసిందే. అలాగే మోహన్ బాబుకు కూడా ఓ బ్రాండ్ ఉంది. వీళ్లిద్దరూ కలిసి ''మందు ముచ్చట్లు'' పెట్టారు. ఎవరు ఏ బ్రాండ్ తాగుతారు.. ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయో బయటపెట్టారు.

“నా మందు వెనక పెద్ద చరిత్ర ఉంది. మద్రాసులో కోడంబాకం బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద వరుసగా సారా దుకాణాలుండేవి. నేను, నా స్నేహితుడు కలిసి అక్కడికి వెళ్లేవాళ్లం. నా ఫ్రెండ్ పేరు మాత్రం నేను చెప్పను. ఇద్దరం కలిసి చెరో 25 పైసలు పెట్టి సారా తాగేవాళ్లం. అక్కడే రిక్షావాళ్లు ఉండేవారు, ఏదో పచ్చడి నాకేవాళ్లు. మేం కూడా అదే చేశాం. అలా మా జీవితాలు మొదలయ్యాయి. ఆ తర్వాత దేవుడి దయతో కాస్త డబ్బులొచ్చాయి. ఇప్పుడు ''రాయల్''గా సెల్యూట్ చేస్తూ విస్కీ తాగుతున్నాం.”

ఇలా తన మందు అలవాటు బయటపెట్టారు మోహన్ బాబు. తొలిసారి హోస్ట్ గా మారి బాలయ్య నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి మోహన్ బాబు అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీళ్లిద్దరూ ఇలా తమ మద్యం బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నారు.

“నా మందు అలవాటు గురించి అందరికీ తెలిసిందే. నేను మేన్సన్ హౌజ్ తాగుతాను. నాకు ఒక ఇల్లు ఉంది. అది కూడా పెద్ద మేన్సన్ హౌజ్. రాత్రికి 'మామ ఏక్ పెగ్ లా' ఉంటుంది. పొద్దున్నే మూడున్నర లేదా 4 గంటలకు లేస్తాను. ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్క్ లోకి జాగింగ్ కు వెళ్తాను. అప్పటికి అది తెరవరు. నేను గోడదూకి అందులోకి వెళ్లిపోయేవాడ్ని. అప్పట్లో చాలామందికి అలా గోడ దూకడం నేర్పించాను.”

ఇలా బాలకృష్ణ, మోహన్ బాబు కలిసి తమ మందు ముచ్చట్లు పంచుకున్నారు. వీళ్లిద్దరి మధ్య రాజకీయ చర్చలు కూడా వచ్చాయి. చంద్రబాబు తనను మోసం చేశాడంటూ స్వయంగా బాలకృష్ణ ఎదుటే మోహన్ బాబు మొహం మీద చెప్పేశారు.

“అన్నగారు ఎన్టీఆర్ ను వదిలేసి చంద్రబాబు వైపు రావడం అప్పట్లో నేను చేసిన తప్పు. రజనీకాంత్ కూడా ఈ విషయంలో నన్ను తిట్టాడు. ఇద్దరం కలిసి ఎన్టీఆర్ ను కలిశాం. ఆయన బాధపడ్డారు. చంద్రబాబు కూడా నా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. పెద్ద ఎన్టీఆర్ లాంటి మహానుభావుడే నన్ను క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా బిరుదు ఇస్తే, ఈ చంద్రబాబు నన్ను క్రమశిక్షణ లేదని పార్టీ నుంచి బయటకు పంపించేశాడు.”

మొత్తమ్మీద బాలయ్య చేసిన తొలి ఇంటర్వ్యూ బాగుంది. మధ్యలో మంచు లక్ష్మి, మంచు విష్ణు వచ్చి ప్రేక్షకుల్ని కాసేపు ఇబ్బందిపెట్టినా, చివర్లో ఛారిటీ కార్యక్రమం అంటూ కాన్సెప్ట్ ను పక్కదోవ పట్టించినా మిగతాదంతా ఓకే.