మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమా ప్రమోషన్ లోనే ఓ విషయాన్ని బయటపెట్టాడు మారుతి. సినిమాకు తెరవెనక ఉందాం అనుకున్నాడు ఈ డైరక్టర్. మరో వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేద్దామనుకున్నాడు.
కానీ అన్నీ బాగా కుదరడంతో తనే దర్శకుడిగా మారి ఈ సినిమా చేశానని స్వయంగా ప్రకటించాడు. అలా చేయడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాడు. మంచి రోజులు వచ్చాయి సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో దర్శకుడిగా మారుతి ఇమేజ కాస్త తగ్గింది. ఇప్పుడీ సినిమా ప్రభావం, అతడి అప్ కమింగ్ మూవీపై పడింది.
గతంలో ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా తీశాడు మారుతి. ఆ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేక మరో వ్యక్తి పేరును దర్శకుడిగా వేశాడు. కానీ ఆ సినిమా హిట్టయింది. దీంతో ఈసారి అలాంటి ప్రయోగాలు చేయకుండా దర్శకుడిగా నేరుగా తన పేరే వేసుకున్నాడు.
ఓవైపు పక్కా కమర్షియల్ అనే పెద్ద సినిమా చేస్తూ కూడా, మధ్యలో ఈ చిన్న సినిమా చేసి, దానికి తన పేరు తగిలించాడు. కానీ ప్రేమకథాచిత్రమ్ రిజల్ట్ ఇక్కడ రిపీట్ అవ్వలేదు.
బహుశా.. ప్రేమకథాచిత్రమ్ సినిమా ఫార్ములాను తన తాజా చిత్రానికి కూడా మారుతి ఫాలో అయి ఉంటే బాగుండేదేమో. ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టాడు మారుతి. ఆ సినిమా క్రేజ్ ను వేస్ట్ చేయడంతో పాటు.. త్వరలోనే రిలీజ్ కావాల్సిన పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాల్ని కూడా తగ్గించుకున్నాడు.