ఉన్నట్లుండి ఒక్క కుదుపు. బాహుబలి ప్రభాస్ సినిమా సలార్ విడుదల తేదీ మారుతోంది అంటూ. ఇక టాలీవుడ్ లో హడావుడే హడావుడి. అధికారికంగా ఈ విషయం అనౌన్స్ కాలేదు కానీ, ఇక నిర్మాణంలో వుండి విడుదల డేట్ వేసుకున్న సినిమాలు అన్నీ కిందా మీదా అయిపోవడం మొదలైంది.
ఇక్కడ రెండు విషయాలు. ఒకటి సలార్ సినిమా కోసం బ్లాక్ చేసుకున్న సెప్టెంబర్ 28 చాలా మంచి డేట్. దాన్ని వదులుకోవడం ఎందుకు? ఆ డేట్ కు వస్తే ఎలా వుంటుంది అని కొన్ని సినిమాల ఆలోచన. అది సరే.. అసలు సలార్ పోయి, పోయి ఎక్కడ పడుతుందో అని మరో ఆలోచన.
డిసెంబర్ లో వస్తే సరే, పెద్దగా మరీ ఎక్కువ సినిమాలు ఏవీ పక్కాగా డేట్ లు పెట్టుకోలేదు. అలా కాకుండా 2024 సంక్రాంతికి అంటే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే సంక్రాంతి డేట్ కు అరడజను సినిమాలు రుమాళ్లు వేసుకుని కూర్చున్నాయి. సలార్ వచ్చి మీద పడితే అంతా కకావికలైపోతాయి. కానీ సలార్ వాయిదా పడినా డిసెంబర్ లో వస్తుందని అప్పుడే టాక్ వినిపించడం ప్రారంభమైంది
ఇదిలా వుంటే మాంచి టఫ్ కాంపిటీషన్ లో వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రీ పోన్ చేసుకుని సలార్ డేట్ కు రావాలని చూస్తోంది. అక్టోబర్ లో టఫ్ కాంపిటీషన్ లో రావడానికి బదులు, సెప్టెంబర్ నెలాఖరులో వస్తే బెటర్ అని ప్రయత్నాలు ప్రారంభించేసింది.
మరోపక్క రెడీగా వున్న చిన్న సినిమాలు చకచకా సెప్టెంబర్ 28 కి విడుదల అంటూ హడావుడి మొదలెట్టేసాయి. ఇంత జరుగుతున్నా సలార్ నుంచి అధికారికంగా క్లారిటీ మాత్రం రావడం లేదు. ఈ నెల ఆరు లేదా ఏడున ట్రయిలర్ వస్తుందని టాక్ వుంది. బహుశా అప్పుడు ఏమన్నా డేట్ వేస్తారేమో? కానీ ఈ నెల విడుదల లేకపోతే ట్రయిలర్ అనవసరం అని కొన్నాళ్లు పక్కన పెట్టి, ఓ పోస్టర్ తో సరిపెడతారేమో? కొద్ది రోజుల పోతే తప్ప క్లారిటీ రాదు.