రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో భారీగా లాభాలు కళ్లజూస్తోంది సన్ పిక్చర్స్ సంస్థ. ఇప్పుడీ లాభాల్లో రజనీకాంత్ వాటా అందుకున్నారు.
జైలర్ సినిమా కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు, లాభాల్లో కూడా వాటా అందుకునేలా రజనీకాంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. కేవలం జైలర్ సినిమా మాత్రమే కాదు, తన ప్రతి సినిమాకూ సూపర్ స్టార్ ఇదే పద్ధతి ఫాలో అవుతారు. అయితే జైలర్ మాత్రం ఈ హీరోకు లాభాలు తెచ్చిపెట్టింది.
రజనీకాంత్ ను ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసిన నిర్మాత కళానిధి మారన్, సూపర్ స్టార్ కు పూలబొకేతో పాటు, చెక్ అందించారు. తాజా సమాచారం ప్రకారం, సినిమా లాభాల్లో తన వాటాగా రజనీకాంత్, 55 కోట్ల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తోంది. దీనికి అదనంగా ఓ ఖరీదైన కారును కూడా సొంతం చేసుకున్నారు.
కొన్ని కార్లను రజనీకాంత్ ఇంటిముందు పార్క్ చేశారు. ఆ కార్లలోంచి బీఎండబ్ల్యూ ఎక్స్-7 కారును రజనీకాంత్ ఎంచుకున్నారు. ఆ కారు తాళాన్ని రజనీకి అందించారు కళానిధిమారన్. ఈ కారు ధర కోటీ 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
ఆల్రెడీ రజనీకాంత్ దగ్గర రోల్స్ రాయిస్ ఉంది. కబాలి నిర్మాత రజనీకి ఆ కారును బహుమతిగా అందించారు. ఇప్పుడు జైలర్ నిర్మాత నుంచి బీఎండబ్ల్యూ కొత్త మోడల్ కారు అందుకున్నారు రజనీ.
ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది జైలర్ సినిమా. నెల్సన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా 328 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది.