సలసలా మరిగిపోతున్న సోషల్ మీడియా

ఓవైపు ఖుషి రిలీజైంది. మరోవైపు భగవంత్ కేసరి హంగామా కూడా మొదలైంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో సలార్ వేడి కొనసాగుతోంది. అంతా సలార్ పైనే పడ్డారు. దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఊహించని…

ఓవైపు ఖుషి రిలీజైంది. మరోవైపు భగవంత్ కేసరి హంగామా కూడా మొదలైంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో సలార్ వేడి కొనసాగుతోంది. అంతా సలార్ పైనే పడ్డారు. దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఊహించని విధంగా ఆ సినిమా వాయిదా పడిందనే టాక్ బయటకు రావడమే.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఓవైపు ఆదిపురుష్ ఫ్లాప్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్, ఎంత తొందరగా సలార్ థియేటర్లలోకి వస్తుందా, ఆదిపురుష్ ను మరిచిపోదామని ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో సలార్ వాయిదా పడబోతోందనే వార్తలు గుప్పుమన్నాయి. సినిమాకు సంబంధించి కొంత సీజీ వర్క్ పై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడట. సినిమాలో కొన్ని షాట్స్ ను మళ్లీ సీజీకి అప్పగించినట్టు తెలుస్తోంది. అవి వెనక్కి వచ్చే దాన్ని బట్టి సినిమా విడుదల ఆధారపడి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, సీజీ వర్క్ కు ఇంకాస్త టైమ్ పడుతుందని, రిలీజ్ ను దాదాపు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ.. కొన్ని సినిమాలు సలార్ తేదీపై కన్నేశాయి. వీలైతే తమ సినిమాను ఆ తేదీకి విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరీ ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు నిర్మాతలు సలార్ తేదీపై గట్టిగా వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సలార్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. కొన్ని ఏరియాస్ కు ఎమౌంట్స్ కూడా లాక్ అయిపోయాయి. అటు ఓవర్సీస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. టికెట్ సేల్స్ రూపంలో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చేశాయి. ఇలాంటి టైమ్ లో సలార్ వాయిదా అంటూ పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా నిండా ఇవే పోస్టులు. దీనిపైనే చర్చ.