తనపై గత 11 సంవత్సరాలుగా అనేక మంది ప్రముఖులు అత్యాచారం సాగించారని.. తనను మొత్తం 143 మంది అత్యాచారం చేసినట్టుగా ఆరోపిస్తూ మిర్యాలగూడకు చెందిన ఒక యువతి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దేశంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికే వార్తల్లో నిలిచాయి.
కేరళలో ఒక యువతిని అనేక మంది ప్రముఖులు అత్యాచారం చేసిన కేసు సంచలనంగా నిలిచింది. ఆ కేసు ఆధారంగా ఒక సినిమా కూడా వచ్చినట్టుగా ఉంది. ఆ కేసులో రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ కేసు పూర్తిగా డైల్యూట్ అయిపోయింది.
ఈ తెలంగాణ అమ్మాయి ఆరోపణలు వింటే.. కేరళలో సంచలనం రేపిన ఆ కేసు గుర్తు రాకమానదు. అయితే కేరళ కేసు పూర్తి భిన్నమైనది కూడా. మిర్యాలగూడ యువతి ఫిర్యాదు మేరకు ఇప్పటికే సదరు ప్రముఖులకు పోలీసులు ఫోన్లు చేసి, పిలిపించుకుని విచారణలు మొదలుపెట్టారట. అయితే వారిలో కొందరు తమకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదని గగ్గోలు పెట్టారట. తమను బ్లాక్ మెయిల్ చేయడానికే ఇదంతా జరుగుతోందని వారు వాపోయారట. ఇక ఆ అమ్మాయి ఫిర్యాదు కూడా ఐదేళ్ల కిందట ఫలానా వ్యక్తి, ఆరేళ్ల కిందట ఇంకో వ్యక్తి.. ఫలానా హోటల్లో అన్నట్టుగా ఉందట. ఐదారేళ్ల కిందట ఆయా హోటళ్లకు సంబంధించిన రికార్డులు, సీసీ కెమెరా వీడియోలు ఇవన్నీ సంపాదించడం కూడా పోలీసులకు అంత తేలికైన విషయం కాదు.
అయితే ఈ కేసును మరో కోణంలో కూడా చూడవచ్చు. ఆమెపై అయిష్టాపూర్వకంగా అఘాయిత్యం జరిగింది కాబట్టి.. ముందుగా ఆమెను ట్రాప్ చేసిన వాళ్లెవరనేది బయటపడాలి. ఆమెను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించిన వ్యక్తులెవరనేది ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. వాళ్లను పట్టుకుంటే.. మొత్తం డొంకంతా బయటపడుతుంది. డైరెక్టుగా ప్రముఖులు అనే విషయం ప్రస్తావించడం సంచలనం కోసమే అవుతుంది. ఆమె ను బంధీగా మార్చిన వారెవరో బయటపడాలి. ఆ తర్వాత ఆమె పై అఘాయిత్యానికి పాల్పడిన ప్రముఖుల వంతు.
అయితే ఆమె ఫిర్యాదు కూడా ప్రముఖుల మీదే చేసిందట. ఈ విషయాలను బయటపెడితే తనను వారు చంపేస్తారని, అందుకే ఇన్నాళ్లూ తను బయటపడలేకపోయినట్టుగా చెప్పిందట. ఇప్పుడు కూడా తన ఫిర్యాదును మరణ వాంగూల్మంగా తీసుకోవాలంటూ ఆమె కోరుతూ పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా సంచలనం కోసమే అని, ఆమెను అడ్డం పెట్టుకుని ఒక ఎన్జీవో బ్లాక్ మెయిలింగ్ కు దిగుతోందని.. ఈ కేసులో నిందితుల వాదనగా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ కేసు కేరళ ఉదంతంలా సంచలనం అవుతుందో లేక కేవలం సంచలనం కోసం చేస్తున్న ఆరోపణగా నిలుస్తుందో!