సైరా ఫలితం చూసేసారు.. ఏజెంట్ బీభత్సం కన్నారు. కానీ అదృష్టం కూడా వుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి చేతిలోకి మరో సినిమా వచ్చింది. నిర్మాత రామ్ తాళూరి ఓ అవకాశం ఇస్తున్నారు. దానికి సై అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆస్థాన కథకుడు వక్కంతం వంశీ వుండనే వున్నారు. అన్నట్లు ఏజెంట్ కథ కూడా ఈ వక్కంతం వారిదే. ఇప్పుడు ఈ సూపర్ కాంబినేషన్ లో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఈ మేరకు ఈరోజు ఆఫీసు తీసారు. పూజ చేసారు. పవన్ కు కథ చెప్పారా? లేదా? చెబితే ఎలాంటి కథ..జానర్ ఏమిటి? ఇలాంటి వివరాలు అన్నీ ఇంకా తెలియాల్సి వుంది. రామ్ తాళ్లూరికి ఒక సినిమా ఎప్పటి నుంచో బకాయి వున్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఆరంభంలో డిజిటల్ కార్యక్రమాలు రామ్ తాళ్లూరి ఆఫీసు నుంచే నిర్వహించారు. అప్పటి నుంచి సినిమా అన్నది వార్తల్లో వుంటూ వస్తోంది.
గతంలో కూడా సురేందర్ రెడ్డి దర్శకుడనే వినిపించింది. అయితే ఏజెంట్ బీభత్సం తరువాత వుండదని అనుకున్నారంతా. కానీ ప్రాజెక్ట్ ఆన్ లోనే వుందని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
పవన్ ఇప్పటికే ఓజి, ఉస్తాద్ సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. హరిహర వీరమల్లు అనే సినిమా వుందనే సంగతే జనాలు మర్చిపోయేలా చేసారు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. పాపం, దర్శకుడు క్రిష్ పరిస్థితి ఏమిటో తెలియదు. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు వార్తల్లోకి వచ్చింది. మరి ఇది ఎన్నికల తరువాత వుంటుందో, ముందు వుంటుందో చూడాలి.
అన్నట్లు కథకుడు వక్కతం దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా నితిన్ హీరోగా డిసెంబర్ లో విడుదల కావాల్సి వుంది. అంతకు ముందు బన్నీ తో ఓ డిజాస్టర్ అందించారు.